వర్క్ మోడ్ లో లవ్ బర్డ్స్... ప్రారంభమవ్వనున్న బ్రహ్మాస్త్ర షూటింగ్
కొంతకాలంగా సినీ ప్రియులను ఊరిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రం, సెట్స్ మీదకు వెళ్లడంతోనే అందరూ హడావిడి చేసేశారు. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న చిత్రంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీగా అంచనాలు పెరిగాయి. ఇక లాక్ డౌన్ తో బ్రేకులు పడ్డ ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే మళ్లీ పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోందట.
రణ్ బీర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను అక్టోబరు నుంచి మొదలుపెట్టాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడు. 26రోజుల షూటింగ్ మిగిలి ఉండటంతో, చిత్ర బృందం రోజుకు రెండు షిఫ్టుల్లో పనిచేయనుందని తెలుస్తోంది. ముంబై ఫిల్మ్ సిటీలో పటిష్ఠాత్మక రక్షణ చర్యల నడుమ చిత్రీకరణకు రంగం సిద్ధమవుతోంది. ఒక్కో షిఫ్ట్ కూ ప్రత్యేకమైన టీమ్ లు పనిచేయనుండగా, రణ్ బీర్, ఆలియాతో పాటూ ఇతర నటులు కూడా డబుల్ షిఫ్ట్ లో పనిచేయనున్నారని తెలుస్తోంది.

మరోవైపు నిర్మాత కరణ్ జోహార్ 2021 జూన్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తుండటంతో డిసెంబర్ నాటికే షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచిస్తున్నాడు. ఇక 65ఏళ్లు పై బడిన వారు బయటకు రాకూడదన్న నిబంధనలు ఉండటంతో, అమితాబ్ ఈ షూటింగ్ లో పాలు పంచుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. త్వరలోనే ఆ నిబంధనలు సడలిస్తారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇక రణ్ బీర్, ఆలియా, అమితాబ్ తో పాటూ, ఈ సినిమాలో మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించబోతున్నారు. మరి భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఊరిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











