రాముడిగా నటిస్తూ... మటన్, పాయా, ఫిష్ కర్రీతో పార్టీ.. వివాదంలో రణబీర్ కపూర్
పాతతరం నటీనటులు నటనను ఒక వృత్తిలా కాకుండా దైవంలా పూజించేవారు. తాము చేయబోయే పాత్రను ఇంకా బాగా చేసేందుకు అవకాశం ఉంటే దాని కోసం సాధన చేసేవారు. రిహార్సల్స్, డైలాగులు ప్రాక్టీస్ చేయడం, పాత్రకు తగిన విధంగా తమను తాము చెక్కుకునేవారు. అందుకే గోల్డెన్ డేస్‌లో ప్రతి సినిమా, ప్రతి పాత్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నటీనటులు, దర్శక నిర్మాతల అంకితభావం, క్రమశిక్షణే ఇందుకు కారణం. కానీ నేటి కాలంలో ఇలాంటి లక్షణాలు మాయమైపోయాయి. ఎవరో కొందరు తప్పించి చాలా వరకు వీటిని పాటించడం లేదు.
ఎన్టీఆర్ కఠిన ఉపవాసాలు
ఓ సినిమా తీస్తున్నామంటే దాని కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకునేది నాటి తరం. ప్రతి పాత్రకు తగిన విధంగా సిద్ధం కావడం, ఏదైనా పౌరాణిక పాత్ర, దేవుళ్ల వేషాలు వేయాల్సి వస్తే కఠోర నియమ నిష్టలు పాటించేవారు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు.. రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి వంటి పాత్రలు పోషించే సమయంలో ఉపవాసం ఉండటం, కటిక నేల మీద పడుకోవడం, మాంసాహారానికి దూరంగా ఉండటం వంటి నిబంధనలతో మనసుని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకునేవారు. ఈ జాగ్రత్తలు తెరమీద స్పష్టంగా కనిపించేవి.

రాముడిగా రణబీర్ కపూర్
ప్రస్తుత కాలంలో పౌరాణిక పాత్రలు, చిత్రాలు చాలా వరకు మాయమైపోతున్నాయి. ఎవరో కొందరు అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. మనదేశంలో, ఈ తరంలో పౌరాణిక పాత్రలంటే ఎక్కువంగా రామాయణం, శ్రీరాముడి జీవితం గురించే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. ఎన్నిసార్లు, ఎంత మంది తీసినా రామాయణాన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్‌లు ప్రధాన తారాగణంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు నితీశ్ తివారీ.
4000 కోట్ల భారీ బడ్జెట్
ఇందులో రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, హనుమంతుడిగా సన్నీడియోల్, కౌశల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విద్యుత్జిహ్వాగా వివేక్ ఒబెరాయ్, మంధరగా షీబా చద్దా రాణిలు నటిస్తున్నారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్లపై యశ్, నమిత్ మల్హోత్రాలు సంయుక్తంగా రామాయణను నిర్మిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ మూవీ బడ్జెట్ దాదాపు 500 మిలియన్లు అంటే 4 వేల కోట్ల రూపాయలు. దాంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ నిలిచింది. 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల చేయనున్నారు.
నాన్‌వెజ్ వంటకాలతో రణబీర్ పార్టీ
అయితే శ్రీరాముడిలా సాత్వికంగా, శాంతంగా కనిపించేందుకు గాను తాను మాంసాహారం, మద్యపానం మానేసి పూర్తిగా శాఖాహారం తీసుకుంటున్నానని.. జిమ్, యోగా, ధ్యానం చేస్తున్నానని గతంలో రణబీర్ వెల్లడించారు. దీంతో అభిమానులు పొంగిపోయారు. కానీ ఇప్పుడు దీనికి పూర్తిగా విరుద్ధంగా, రణబీర్ వ్యక్తిత్వం మచ్చపడే తరహా వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో లెజెండరీ నటుడు, దివంగత రాజ్ కపూర్ 100వ జయంతిని పురస్కరించుకుని డైనింగ్ విత్ కపూర్స్ పేరుతో మొత్తం కపూర్ ఫ్యామిలీ ఓ చోటికి చేరుకుని భోజనం చేస్తున్నారు. అర్మాన్ జైన్.. డైనింగ్ టేబుల్ వద్ద కపూర్ వంశానికి ఫిష్ కర్రీ, రైస్, జంగ్లీ మటన్, పాయా వడ్డిస్తున్నాడు. ఇందులో కరీనా, కరిష్మా, సైఫ్ అలీఖాన్, రిమా జైన్, నీతూ కపూర్‌లతో కలిసి రణబీర్ భోజనం చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రణబీర్‌పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రణబీర్ మోసం చేశారని.. తన కుటుంబంతో కలిసి హాయిగా ఫిష్ కర్రీ, మటన్, పాయాలను ఆస్వాదిస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి దీనిపై రణబీర్, కపూర్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











