50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతోన్న హీరో... డీప్ ఫారెస్ట్‌లో భార్యతో సెలబ్రేషన్స్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా గుడ్‌న్యూస్ చెబుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ - ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా- రాఘవ్ చద్దా దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. ఆ నటుడు ఎవరు? ఈ వయసులో తండ్రి కావడం ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..
విలక్షణ నటుడిగా మెప్పించిన హుడా
ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో రణదీప్ హుడా. విలక్షణ నటన, డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హుడా. హీరోలు హీరో పాత్రలే చేయాలని ఓ పరిధిలో ఉండకుండా... తన మనసుకు నచ్చితే చిన్న వేషాలు వేయడానికి కూడా సిద్ధమేనని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో సత్తా చాటారు. తొలుత మాన్‌సూన్ వెడ్డింగ్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రణదీప్ హుడా. స్టార్ హీరోలతో నిండిపోయిన బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఆయనకు కాస్త టైం పట్టింది.

వరుస సినిమాలతో బిజీ
అయితే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌టెయిల్, హీరోయిన్, జాట్, మర్డర్ 3, రంగ్ రాసియా, సర్‌బ్‌జిత్, కిక్, సుల్లాన్, బాఘీ 2, కాట్ తదితర చిత్రాలతో ఆయన హీరోగా స్థిరపడ్డారు. ప్రస్తుతం రణదీప్ హుడా మ్యాచ్ బాక్స్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నారు. సామ్ హర్‌గ్రేవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ సినా, జెస్సికా బెల్, సామ్ రిచర్డ్సన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది మ్యాచ్ బాక్స్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుస్మితా సేన్‌తో ఎఫైర్
మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేసిన హుడా తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పారు. సుస్మిత తర్వాత నితూ చంద్ర, నందన సేన్‌లతోనూ ఆయన ప్రేమాయణం సాగించినట్లుగా బీటౌన్ టాక్. కొంతకాలం ఒంటరిగానే ఉంటూ తన సినిమాలపై ఫోకస్ పెట్టిన రణదీప్ హుడా.. మణిపూర్‌కు చెందిన లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడ్డారు. లిన్.. మోడల్‌గా, నటిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఏకో ఫ్రెండ్లీ జ్యూవెలరీ కంపెనీ షామో సానాకు వ్యవస్థాపకురాలిగా, ఎండీగా వ్యవహరిస్తున్నారు. తొలుత షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓంలో లిన్ గెస్ట్ రోల్ పోషించారు. ఆ తర్వాత మేరీకోమ్, ఉమ్రికా, రంగూన్, అక్సోన్, జానే జాన్, హ్యాట్రిక్, మాత్రు కీ బిజిలీ కా మండోలా సినిమాలలో నటించారు.
తల్లిదండ్రులం కాబోతున్నాం
రణదీప్, లిన్‌లు పెద్దల అంగీకారంతో 2023 నవంబర్ 29న మణిపూరి ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి రెండేళ్లు కావొస్తున్నా ఈ దంపతులు గుడ్‌న్యూస్ చెప్పకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు హుడా- లిన్. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు రణదీప్ హుడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. రెండేళ్ల ప్రేమ, సాహసం.. ఇప్పుడు లిటిల్ వైల్డ్ రాబోతోంది అని రణదీప్ హుడా తెలిపారు. భార్య లిన్‌తో కలిసి డీప్ ఫారెస్ట్‌లో చలిమంటలు కాచుకుంటూ ఈ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో రణదీప్ హుడా - లిన్ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











