అర్జెంట్ అయితే గిన్నెలో పోసుకోమన్నారు.. స్టార్ హీరోకి చేదు అనుభవం
భారతదేశం విభిన్న ఆచారాలు, సాంప్రదాయలకు నెలవు. 28 రాష్ట్రాలు, వేలాది భాషలు, ప్రాంతానికో ఆచారం, మతాలు, కులాలు ఎన్నో. ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఏకతాటిపైకి తీసుకొస్తోంది. దేశంలోని కొన్ని ఆచారాలు, పద్ధతులు వింతగా ఉంటాయి. కానీ ఎవరి నమ్మకాలు వారివి. కానీ ఎవ్వరూ వేలెత్తి చూపరు.. అదే ఇండియా అంటే. ఒకరి సాంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ భారతీయులు ముందుకు సాగుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోకి మాత్రం ఓ ఆచారం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..
విలక్షణ నటుడిగా రణదీప్
బాలీవుడ్ సీనియర్ హీరో రణదీప్ హుడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటన, డిఫరెంట్ మేనరిజంతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో పాత్రే చేయాలని గిరి గీసుకుని కూర్చోకుండా తన మనసుకు నచ్చితే చిన్న వేషాలు వేయడానికి కూడా సిద్ధమేనని పలుమార్లు రుజువు చేసుకున్నారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్‌లో ఇప్పటికే నటించారు. మాన్‌సూన్ వెడ్డింగ్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హుడా.. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌టెయిల్, హీరోయిన్, జాట్, మర్డర్ 3, రంగ్ రాసియా, సర్‌బ్‌జిత్, కిక్, సుల్లాన్, బాఘీ 2, కాట్ తదితర చిత్రాలతో తన సత్తా చాటుకున్నారు.

నెలలో 18 కేజీలు వెయిట్ లాస్
ముఖ్యంగా సర్‌బ్‌జిత్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సర్‌బ్‌జిత్ కోసం రణదీప్ హుడా తనను తాను మార్చుకున్నారు. పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు గాను 28 రోజుల్లో ఏకంగా 18 కిలోల బరువు తగ్గి శెభాష్ అనిపించుకున్నారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో అంత బరువు తగ్గడం మంచిది కాదని పలువురు సూచించినా హుడా లెక్క చేయకపోవడం ఆయన నిబద్ధతకు మచ్చుతునక. ఈ ఏడాది జాట్‌లో విలన్ రణతుంగగా క్రూరత్వం చూపించిన ఆయన ప్రస్తుతం మ్యాచ్ బాక్స్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తున్నారు.
సుస్మితా సేన్‌తో డేటింగ్
మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేసిన హుడా తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పారు. ఆ తర్వాత ఒంటరిగానే ఉంటూ తన సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆయన మణిపూర్‌కు చెందిన లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడి ఆమెను పెద్దల అంగీకారంతో 2023లో పెళ్లాడారు. వివాహం అయ్యే నాటికి ఆయన వయసు 45 ఏళ్లు. అయితే లిన్‌తో వివాహం సమయంలో తనకు వింత అనుభవం ఎదురైందని రణదీప్ గుర్తుచేసుకున్నారు. పూర్తిగా మణిపూరి సాంప్రదాయంలో తమ వివాహం జరిగిందని.. వాళ్ల కట్టుబాట్లు కఠినంగా ఉండేవని ఆయన తెలిపారు.
గిన్నెలో పోసుకోమన్నారు
వివాహం జరిగే సమయంలో తనకు అమ్మాయి తరపు వారు ఓ గిన్నెను, గొడుగును ఇచ్చారని.. ఎందుకని దానిని అడిగితే మూత్ర విసర్జన కోసం అని చెప్పారని రణదీప్ వెల్లడించారు. పెళ్లి తంతు మొదలయ్యాక వధూవరులను ఓ ప్రదేశంలో ఉంచుతారని.. పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు అక్కడే మమ్మల్ని చూశారని హీరో తెలిపారు. నా పక్కన ఉన్న సహాయకుడు నాకు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే గొడును తెరిచి అక్కడే మూత్ర విసర్జన చేయమని చెప్పడంతో తాను షాక్ అయ్యానని రణదీప్ అన్నారు. తమను దైవాంశ సంభూతులుగా చూస్తారని అందుకే ఈ ఏర్పాట్లు చేశారని చెప్పారు. అలాగే పెళ్లికి నేను నా 12 మంది మిత్రులతో మణిపూర్‌లోని లిన్ ఇంటికి వెళ్లగా మంచి ఆతిథ్యం ఇచ్చారని రణదీప్ తెలిపారు. మొత్తానికి నా పెళ్లి ఒక అంతర్యుద్ధంలా అనిపించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











