సాహో నటి మందిరా బేడికి తీవ్ర విషాదం.. గుండెపోటుతో భర్త తిరిగి రాని లోకాలకు..
బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తన భర్త, సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత రాజ్ కౌశల్ గుండెపోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. దీంతో సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజ్ కౌశల్ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో సంతాప సందేశాలను వెల్లడిస్తున్నారు. మందిరా బేడి భర్త మరణం గురించిన మరిన్ని విషయాల్లోకి వెళితే....

గుండెపోటుతో ఆకస్మిక మరణం
దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ బుధవారం (జూన్ 30వ తేదీన) గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గుండెపోటుకు గురైన ఆయనను హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలను కాపాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయనకు భార్య మందిరా బేడితోపాటు కుమారుడు వీర్, కూతురు తారా ఉన్నారు అని మీడియా వెల్లడించింది.

తీవ్ర విషాదంలో మందిరా బేడి..
చాలా కాలం ప్రేమలో ఉన్న మందిరా బేడి, రాజ్ కౌశల్ 1999లో పెళ్లి చేసుకొన్నారు. చాలా ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీర్ అనే కుమారుడు ఉండగా, 2020లో తార అనే అమ్మాయిని దత్తతగా స్వీకరించారు. ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో మందిరా బేడీ జీవితం విషాదంతో ఓ కుదుపుకు లోనైంది.

జూన్ 27న ఇంటిలో పార్టీతో ఆనందంగా
మందిరా బేడి, రాజ్ కౌశల్ కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జూన్ 27 తేదీన ఇంటిలో పార్టీ చేసుకొంటూ ఆనందంగా కనిపించారు. తమ కుటుంబం చేసుకొన్న విందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకొన్నారు.

రాజ్ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే..
రాజ్ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే.. కాపీ రైటర్‌గా ప్రొఫెషనల్ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు ముకుల్ ఆనంద్, సుభాష్ ఘాయ్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. సుభాష్ ఘాయ్ నిర్మించిన త్రిమూర్తి చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్యార్ మే కభీ కభీ, షాదీ కా లడ్బూ, అంథోని కౌన్ హై చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1998లో అడ్వర్టైజింగ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. దాదాపు 800కిపైగా వ్యాపార ప్రకటనలను రూపొందించారు.

ప్రముఖుల సంతాపం
రాజ్ కౌశల్ మృతికి రోహిత్ రాయ్, రోషన్ అబ్బాస్ లాంటి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాజ్ కౌశల్ ఇకలేరనే వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాం. ఆయన లేని లోటు తీర్చలేనిది. రాజ్ కౌశల్ కుటుంబ సభ్యులకు, స్నేహితులు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పలువురు సంతాప సందేశాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











