Adipurush నుంచి అదిరిపోయే న్యూస్: కండలు చూపిస్తూ సందడి చేసిన స్టార్ హీరో
'ఈశ్వర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలోనే పలు విజయాలను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా.. వాటి నుంచి వెంటనే కోలుకున్నాడు. తద్వారా మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాని తర్వాత కూడా 'సాహో'తో సంచలనం అయిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు వరుస పెట్టి భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఇప్పటికే 'రాధే శ్యామ్'ను పూర్తి చేసిన ఈ స్టార్.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు.
పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ మూవీ ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడడంతో ఆలస్యం అయింది. ఇప్పుడు ముంబైలో చివరి షెడ్యూల్‌ను శరవేగంగా జరుపుతున్నారు.

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య భీకరమైన పోరును డిజైన్ చేశాడట దర్శకుడు. ఇక, ఇందులో రావణుడి పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందట. రాముడి పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నాడట ఓం రౌత్. అంతేకాదు, సైఫ్ ఇందులో పొడవాటి జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నాడట. అలాగే, నుదుటిపై పొడవాటి నల్ల బొట్టును కూడా పెట్టుకుని భయంకరంగా దర్శనమివ్వబోతున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడం కోసం సైఫ్ అలీ ఖాన్ రోల్‌ను మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట ఓం రౌత్. అందుకే ఆయనపై ఎన్నో కీలకమైన సన్నివేశాలను షూట్ చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సైఫ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో అతడితో కేక్ కూడా కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. తాజాగా యూనిట్ రిలీజ్ చేసిన ఫొటోల్లో ఈ సీనియర్ హీరో కండలు చూపిస్తూ తెగ సందడి చేస్తున్నాడు. ఇక, ఇప్పుడు ప్రభాస్ భాగమే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











