సైఫ్ అలీఖాన్‌కు కోర్టులో షాక్ .. 15000 కోట్ల ఆస్తులు కోల్పోయిన స్టార్ హీరో
బాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో సైఫ్ అలీఖాన్ ఒకరు. యాక్షన్, లవ్, రొమాంటిక్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినీనటుడిగా ప్రవేశం ముందే ఆయనది బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. భారతదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న సంస్థానాల్లో ఒకటైన పటౌడీ రాజవంశానికి సైఫ్ అలీఖాన్ వారసుడు. టీమిండియా మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ కుమారుడు. ఇప్పుడు ఈ వారసత్వ వివాదంలోనే ఏకంగా 15 వేల కోట్ల ఆస్తులను సైఫ్ అలీఖాన్ కోల్పోయాడు. ఈ వివరాలు తెలియాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
భారతదేశంలో బ్రిటీష్ వారి రాకకు ముందు ఆ తర్వాత ఎన్నో రాజవంశాలు ఈ దేశాన్ని పాలించాయి. ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి భోపాల్ సంస్థానంగా పిలిచేవారు. దీనిని హామీదుల్లా ఖాన్ కుటుంబం పాలించింది. ఆయన సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీకి స్వయానా మేనమామ. హామీదుల్లాఖాన్‌కు ముగ్గురు కూతుళ్లు.. వారిలో పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్.. భారత్ - పాకిస్తాన్ విభజనతో పాక్‌కు వలస వెళ్లారు. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ ఇండియాలోనే ఉన్నారు.

భారత్‌లో విలీనమైన భోపాల్ సంస్థానం
సైఫ్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీని సాజిదా పెళ్లాడారు. ఈ దంపతుల కుమారుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. అయితే 1960 ఫిబ్రవరి 4న హమీదుల్లా ఖాన్ మరణించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక సంస్థానాల విలీనాల కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టారు. ఈ దశలో 1949 ఏప్రిల్ 30న ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. విలీన ఒప్పందం ప్రకారం.. నవాబ్‌కు ప్రత్యేక హక్కులు ఉంటాయని, ఆస్తులపై యాజమాన్యం, వారసత్వం ఉంటుందని భారత ప్రభుత్వం .. భోపాల్ సింహాసన వారసత్వ చట్టం 1947లో స్పష్టంగా తెలిపింది.
నవాబ్ వారసురాలిగా సాజిదా
హమీదుల్లా ఖాన్ మరణం తర్వాత సాజిదా సుల్తాన్ నవాబుగా ప్రకటించబడ్డారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం హమీదుల్లా ఆస్తి పంపకాలపై వివాదం మొదలైంది. జిల్లా కోర్టులో తొలుత పిటిషన్ దాఖలవ్వగా.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లా కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. పెద్ద కుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వలస వెళ్లడంతో వారసత్వ ఆస్తి తనకే దక్కుతుందని సాజిదా భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం సాజిదాను నవాబ్‌కు అసలైన వారసురాలిగా 1962 జనవరి 10న ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
సైఫ్ షాకిచ్చిన శత్రు ఆస్తి చట్టం
దీని ప్రకారం సాజిదా తర్వాత ఆమె కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ, ఆయన తదనంతరం సాజిదా మనవడు సైఫ్ అలీఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారుడు. ఇదే సమయంలో 1947లో అఖండ భారత్ విభజన సమయంలో భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లిన వ్యక్తులకు తాలూకా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి 1968లో శత్రు ఆస్తి చట్టం తీసుకొచ్చింది కేంద్రం. దీంతో 2015లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబు భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. దాంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం శత్రు ఆస్తుల చట్టాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టును సైతం ఆశ్రయించారు.
ట్రయల్ కోర్ట్ తీర్పును కొట్టేసిన హైకోర్ట్
ఈ వివాదం కోర్టులో నలుగుతుండగా 2019లో సైఫ్ అలీఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా.. తల్లి షర్మిల ఠాగుర్‌లను వారసత్వ ఆస్తులకు హాక్కుదారులుగా ట్రయల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. తాజాగా ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. నవాబ్ హమీదుల్లా ఆస్తులను శత్రు ఆస్తిగా ప్రకటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే సైఫ్ అలీఖాన్, తల్లీ షర్మిలా ఠాగూర్, ఆయన సోదరీమణులు సోహా, సబాలను వారసులుగా గుర్తిస్తూ ట్రయల్ కోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ వారసత్వ ఆస్తుల వివాదాన్ని కొత్తగా విచారించి తేల్చాలని.. అందుకే ఏడాది డెడ్‌లైన్ విధించింది న్యాయస్థానం. దీంతో సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన దాదాపు 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లనున్నాయి. మరి సైఫ్ కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











