అమీర్‌ఖాన్ కొడుకైతే ఏంటీ.. లాగిపడేసిన సల్మాన్ సెక్యూరిటీ .. వీడియో వైరల్!
దేశంలో సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకుల భద్రతను పర్యవేక్షించానికి ప్రైవేట్ సైన్యం మాదిరిగా బాడీగార్డులు ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రముఖులు వచ్చే సమయంలో ఆరడుగుల ఎత్తుతో భారీకాయంతో చూపులతోనే భయపడే బాడీగార్డ్స్‌ని మెయింటైన్ చేయడం చాలా మంది స్టేటస్ సింబల్‌గా చూస్తారు. అయితే వీరు చేసే ఓవరాక్షన్ కారణంగా సెలబ్రెటీలు మాటలు పడాల్సి వస్తోంది. జనాన్ని తోసేయడం, దాడి చేయడం వంటి ఘటనలతో బాడీగార్డ్స్ వార్తల్లో ఉంటారు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ వివాదంలో నిలిచారు. ఈ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌కు ఐకాన్‌గా సల్మాన్
మూడున్నర దశాబ్ధాలుగా బాలీవుడ్‌కు ఐకాన్‌గా మారారు సల్మాన్ ఖాన్. బ్లాక్‌బస్టర్ చిత్రాలతో 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సికందర్ సినిమాతో పలకరించిన ఆయన మరిన్ని క్రేజ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. ఇదికాక త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 19తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 30 ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా రాజస్తాన్‌లో ఉన్న సల్మాన్ .. కృష్ణ జింకలను వేటాడిన ఘటన బాలీవుడ్‌తో పాటు దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.

సల్మాన్ హత్యకు లారెన్స్ గ్యాంగ్ కుట్ర
కేసు నుంచి బయటపడినా ఆయనను ప్రాణభయం వెంటాడుతోంది. కారణం కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. కృష్ణజింకలను దైవంలా, తమ పూర్వీకులుగా భావించి ఆరాధిస్తారు బిష్ణోయ్ తెగవాళ్లు. అలాంటి కృష్ణజింకలను వేటాడటంతో సల్మాన్‌పై ఈ తెగ అప్పట్లోనే అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ తెగకే చెందిన లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్‌ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. సుపారీ హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి నేరాలతో లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ముంబై పోలీసులను వణికించాడు. తీహార్ జైళ్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన గ్యాంగ్‌తో నేరాలు చేయిస్తున్నాడు.
సల్మాన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
సల్మాన్‌ను చంపుతానన్న లారెన్స్ పలుమార్లు దాడులు చేయించడం, ఆయన ఇంటి వద్ద రెక్కీ, కాల్పులతో పాటు సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని దారుణంగా కాల్చి చంపించాడు. ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. ఇప్పటికే తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను సైతం బిగించాడు సల్మాన్. ఎక్కడికి వెళ్లినా భారీ కాన్వాయ్, సాయుధ కమాండోలు, పోలీసులు9 సల్మాన్‌కు రక్షణ కల్పిస్తున్నారు. వీరికి తోడు ఆయన ప్రైవేట్ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు.
అమీర్ కొడుకుని నెట్టేసిన బాడీగార్డ్స్
అయితే వీరి ఓవరాక్షన్ కారణంగా సల్మాన్ పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త, స్టార్ హీరో విక్కీ కౌశల్‌ను ఆయన బాడీగార్డ్స్ తోసేయడం వివాదాస్పదమైంది. తాజాగా అమీర్‌ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ స్పెషల్ షోకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ మూవీని వీక్షించేందుకు అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వచ్చాడు. థియేటర్ వద్ద సల్మాన్ దగ్గరికి వచ్చేందుకు జునైద్ యత్నించగా.. అతనెవరో గుర్తుపట్టని సల్మాన్ భద్రతా సిబ్బంది ఒక్కసారిగా పక్కకి తోసేశారు. దీంతో జునైద్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బాలీవుడ్ సూపర్‌స్టార్ హీరో కొడుకునే పక్కకు తోసేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











