HBD Salman khan : సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లంటే? షారుఖ్‌తో పోలిస్తే ఎక్కడ?
భారతీయులకు బాలీవుడ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో అమితాబ్ బచ్చన్ ఒకరైతే ఆ తర్వాత ఖాన్ త్రయం ఠక్కున మెదులుతారు. వారిలో కండల వీరుడు సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి.. దాదాపు 3 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేశారు సల్మాన్ ఖాన్. ఇవాళ ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా సల్లూభాయ్ గురించి ఆసక్తికర విషయాలు ఒకసారి పరిశీలిస్తే :
1965 డిసెంబర్ 27న బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీంఖాన్- సుశీల చారక్ దంపతులకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు సల్మాన్ ఖాన్. ఆయన పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. తల్లిదండ్రులు హిందూ - ముస్లింలకు చెందిన వారు కావడంతో ఆయన రెండింటిని పాటిస్తారు. అన్ని పండుగలను తన నివాసంలో ఘనంగా జరిపిస్తారు. సల్మాన్ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్‌లోని అలకోజాయ్ పస్తూన్ తెగకు చెందిన వారు . భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో వీరు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వలస వచ్చారు. ముంబై, గ్వాలియర్‌లలో సల్మాన్ ఖాన్ విద్యాభ్యాసం పూర్తి చేశారు.

1988లో ఫలాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత చిన్నాచితకా పాత్రలతో హీరో స్థాయికి చేరారు. మైనే ప్యార్ కియా, సనమ్ బేవాఫా, సాజన్ చిత్రాలతో యువతలో తిరుగులేని స్థార్ డమ్ సంపాదించిన ఆయన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్నారు. 50 ప్లస్‌లోనూ నేటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒక ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఆయన పది సార్లు నటించి, ఈ ఘనత సాధించిన అరుదైన నటుడిగా నిలిచారు సల్మాన్.
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా సల్మాన్ ఆకట్టుకున్నారు. హిందీ బిగ్‌బాస్ కార్యక్రమానికి హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక తాము దైవంలా ఆరాధించే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకోగా... సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది.
ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో సల్మాన్ ఖాన్ కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారు. సినిమాకు రూ. 100 నుంచి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు సల్మాన్ . ఇది కాకుండా ఎన్నో ఫేమస్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 3000 కోట్ల పై మాటే. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. ముంబై బాంద్రాలో గ్యాలెక్సీ అనే అపార్ట్‌మెంట్ సల్మాన్ ఖాన్‌కు ఉంది. దీని విలువ రూ. 150 కోట్ల పై మాటే. ముంబైలో బీచ్ సైడ్ ఇల్లు, లింక్ రోడ్డులో రూ. 120 కోట్ల ప్రాపర్టీ, 150 ఎకరాలలో అర్పిత ఫామ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిట్‌నెస్ సెంటర్లు, ఉన్నాయి. వీటికి తోడు కోట్లు విలువైన లగ్జరీ వాచ్‌లు, బ్రేస్ లెట్స్‌కు లెక్కే లేదు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











