57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ హీరో.. భార్యకి విడాకులిచ్చి ఆమెతో రెండో పెళ్లి తర్వాత..
ప్రస్తుతం ఇండియాలో సెలబ్రెటీల ఇళ్లలో వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరికొందరేమో తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ - సిద్దార్ధ్ మల్హోత్రా, టాలీవుడ్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీలు గుడ్‌న్యూస్ చెప్పారు. శుక్రవారం తెలుగు యువ హీరో అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్జీ మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా ఓ సీనియర్ హీరో అది కూడా ఏకంగా 57 ఏళ్ల వయసులో తాను తండ్రిని కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు, ఇండస్ట్రీకి షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
సల్మాన్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హిందీతో పాటు తెలుగులో జై చిరంజీవా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాలలో నటించి ఇక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే తన సహ నటి, బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరాను 1998లో పెళ్లాడారు అర్బాజ్ ఖాన్. ఈ దంపతులకు అర్హాన్ ఖాన్ సంతానం. దాదాపు 19 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగించిన ఈ జంట అనివార్య కారణాలతో విడాకులు తీసుకుని షాకిచ్చింది. 2016 మార్చి 11న ఈ జంట పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు పొందింది.

వివాదాల్లో అర్బాజ్ ఖాన్
మలైకా తనకంటే ఎంతో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసి ఇండస్ట్రీకి షాకిచ్చింది. కొద్దిరోజులకే అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పేసి అతనిని కూడా వదిలించుకుంది. అయితే అర్బాజ్ మాత్రం తన సినిమాలు, వ్యాపారాలు, షోలు చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు. మనోడు పేరుకి బోలెడన్నీ కాంట్రవర్సీలతో లింకులు ఉన్నాయి. 2012లో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని తన కారుతో ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2018లో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లోనూ అర్బాజ్ ఇరుక్కున్నాడు.
మేకప్ ఆర్టిస్ట్‌తో ప్రేమలో పడ్డ అర్బాజ్
ఒంటరిగా ఉండలేకపోయిన అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసి రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యే సమయానికి అర్భాజ్ ఖాన్ వయసు 55 ఏళ్లు కాగా.. ఆమెకు 33. వయసు అంతరంపై మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అర్బాజ్. నా భార్య నా కంటే వయసులో చిన్నది అయినప్పటికీ.. ఆమెకు ఏం కావాలో ఆమెకు తెలుసు, నాకు ఏం కావాలో నాకు తెలుసు.. అలాగే ఒకొకరికొకరు ఏం ఆశిస్తున్నామో మాకు అవగాహన ఉందన్నాడు.
బంధానికి వయసుతో పనిలేదు
ఏడాదికి పైగా ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం.. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని అర్భాజ్ తెలిపాడు. సంబంధాల్ని కొనసాగించడానికి వయసు కారణం కాదు.. ఎంతో అంతరం ఉన్న వారి మధ్య సంబంధాలు బాగున్నాయి అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాజాగా అర్బాజ్ - షురా దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. షురా గర్భం దాల్చారని, త్వరలో తల్లి కాబోతున్నట్లు అర్బాజ్ తెలిపారు. త్వరలోనే సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలోకి బుల్లి మెంబర్ రానున్నాడు. దీంతో సల్మాన్ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అర్బాజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికి 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కానుండటంతో అర్బాజ్ చాలా సంతోషంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











