ఇదంతా వారి వల్లే.. పూర్తిగా కోలుకున్న సంజయ్ దత్
సంజయ్ దత్ హాస్పిటల్‌లో చేరారనే వార్త రాగానే అభిమానులందరూ ఆందోళన చెందారు. జీవితంలో ఎన్నింటినో ఎదుర్కొన్న ఫైటర్‌గా సంజయ్ దత్ మళ్లీ తిరిగి వస్తారని అందరూ ఆశించారు. అందుకోసం అందరూ ప్రార్థనలు కూడా చేశారు. వారి కోరిక నేడు నెరవేరింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన తాను పూర్తి ఆరోగ్య వంతుడిగా మారానాని ఓ ప్రకటన చేశాడు సంజయ్ దత్.
'గత కొన్ని వారాలుగా నేను నా కుటుంబం గడ్డు కాలాన్ని చూశాం. భరించేవాడికే బాధలు ఇస్తాడని కొందరు చెబుతుంటారు కదా అది నిజమే. ఈ రోజు నా పిల్లల బర్త్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను. నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాను. నా ఫ్యామిలీతో ఆనందంగా ఉంటున్నాను. ఇదే నా పిల్లలకు నేను ఇవ్వగలిగే గొప్ప బహుమతి.

మీ అందరి నమ్మకం, ఆశీర్వాదం, ప్రేమ లేకపోతే ఇది జరిగేది కాదు. నా ఫ్యామిలీకి, నా అభిమానులందరికీ ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను. ఇలాంటి కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మీరు పంచిన ప్రేమ, ఇచ్చిన ఆశీర్వాదాలకు ఎప్పుడూ రుణపడే ఉంటాను. కోకిలాబెన్ హాస్పిటల్‌లో డా. సేవంతి, ఆమె వైద్య బృందం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వారందరూ నన్ను బాగా చూసుకున్నారు. వారికెప్పుడూ రుణపడే ఉంటాను' అని సంజయ్ దత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్ కేజీయఫ్ చాప్టర్ 2 కోసం రెడీ అయ్యాడు.


Click it and Unblock the Notifications











