చిక్కుల్లో సీనియర్ నటుడు.. చీటింగ్ కేసుతో ఇబ్బందులు
సీనియర్ నటుడు, మరాఠీ నాటక రంగానికి విశేష సేవలందించిన విక్రమ్ గోఖలే చిక్కుల్లో పడ్డారు. ఆయనతోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. పూణేలోని ఓ భూమి వివాదంలో 14 మందిని మోసగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల తెలిపారు. మరో ఇద్దరిని జయంత్ మాల్గి, సుజాత మాల్గిగా గుర్తించామని పేర్కొన్నారు. పూణే జిల్లాలోని ముల్షి తాలుకాలోని పౌడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు నమోదైందని,
జయంత్ భైరత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. సేల్ డీడ్ తర్వాత కూడా తాను భూమిపై హక్కులు సాధించలేకపోయానని ఆరోపిస్తూ ఫిర్యాదులో తెలియజేశారని పేర్కొన్నారు. గిరివన్, సుజాత ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ ముగ్గురికి సంబంధముందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టును చేశారు. ఆ విషయాన్ని చెప్పకుండా మోసగించారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు.

ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం. ముగ్గురిపై కేసు నమోదు చేశాం. వాస్తవాలను తెలుసుకోనేందుకు ప్రయత్నిస్తున్నాం. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకొంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని విక్రమ్ గోఖలే ఆరోపణలను ఖండించారు.
విక్రమ్ గోఖలే విషయానికి వస్తే.. నాటక, మరాఠీ, హిందీ చిత్ర సీమలో ఐదు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. వర్మ రూపొందించిన అబ్ తక్ చప్పన్, ఇటీవల విడుదలైన ఐయారీ, మిషన్ మంగళ్, ఫిరంగి, భూల్ భులయ్యా, హే రామ్ తదితర చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











