Jawan Prevue: హాలీవుడ్ రేంజ్‌లో జవాన్ ప్రివ్యూ.. ఏ హీరో నిలబడలేడు అంటూ!
దాదాపు నలభై ఏళ్లకు పైగానే ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. అప్పట్లో లవ్ స్టోరీ మూవీలకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ బాద్‌షా.. క్రమంగా పంథాను మార్చుకుని ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. అయితే, చాలా కాలం పాటు విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న షారూఖ్.. ఈ ఏడాది వచ్చిన 'పఠాన్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో 'జవాన్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రమే 'జవాన్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి 'ప్రివ్యూ' పేరిట ఓ వీడియోను విడుదల చేశారు.

అట్లీ - షారూఖ్ ఖాన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'జవాన్' మూవీ ప్రివ్యూ వీడియో కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. అంతేకాదు, ఈ వీడియోలో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా షారూఖ్‌ను చూపించిన తీరు మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇక, ఈ వీడియోను బట్టి చూస్తే ఈ చిత్రంలో హీరో రెండు కోణాలు ఉన్న పాత్రలో నటించినట్లు కనిపిస్తోంది.
'జవాన్' మూవీ ప్రివ్యూ వీడియోలో షారూఖ్ ఖాన్ తన పాత్రను తాను పరిచయం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇందులో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను ఫిదా చేసేశాడు. ఇక, చివర్లో అతడు గుండుతో కనిపించి షాక్ ఇచ్చాడు. అంతేకాదు, 'నేను విలన్ అయితే.. ఏ హీరో కూడా నా ముందు నిలబడలేడు' అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ ప్రివ్యూతో 'జవాన్' మూవీపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











