రాకెట్ ఎక్కుతున్న షారుక్ ఖాన్, సూర్య.. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను కాదనలేక..
విలక్షణ నటుడు మాధవన్ తాజాగా నటిస్తున్న చిత్రం రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్. ఈ చిత్రం అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి స్వయంగా మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, తమిళ సూపర్ స్టార్ సూర్య అతిథి పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

‘రాకెట్రీ' మూవీ కథ ఇదే
దేశ రహస్యాలను పొరుగు దేశాలకు చేరవేశాడనే ఆరోపణలపై శాస్త్రవేత్త నంబి నారాయణ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కేసు కొట్టివేశారు. అరెస్ట్ కాలంలో నంబి అనుభవించిన మానసిక క్షోభను, కుటుంబంలో చోటుచేసుకొన్న బాధలను ఈ చిత్రంలో మాధవన్ తెరకెక్కిస్తున్నారు.

షారుక్, సూర్య ముఖ్య అతిథిగా
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రంలో షారుక్, సూర్య నటిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హిందీ వెర్షన్‌లో షారుక్, తమిళ వెర్షన్‌లో సూర్య కీలక పాత్రలను పోషిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాధవన్ రిక్వెస్ట్‌కు షారుక్, సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రం హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషలతోపాటు మరికొన్న భాషల్లో కూడా డబ్బింగ్ అవ్వనున్నది.

డైరెక్టర్‌గా మారిన మాధవన్
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రానికి తొలుత అనంత్ మహాదేవన్ దర్శకుడు. మాధవన్ కో డైరెక్టర్‌గా పనిచేస్తూనే నటించాడు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెసెస్ కారణంగా అనంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. దాంతో దర్శకత్వ బాధ్యతలు మాధవన్ తీసుకొన్నాడు. కొన్ని పరిస్థితుల కారణంగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చిందని మాధవన్ వివరణ ఇచ్చారు.

హీరోయిన్‌గా సిమ్రాన్‌కు అవకాశం
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రంలో మాధవన్ సరసన సిమ్రాన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రానికి సీఎస్ సామ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











