పాకిస్తాన్‌లోని షారుక్ ఖాన్ సోదరి మృతి.. షాక్‌లో బాలీవుడ్ బాద్‌షా
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) మరణించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివాసముండే నూర్ జెహాన్ మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. నూర్ జెహాన్ పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

క్యాన్సర్ వ్యాధి..
గత కొంతకాలం నుంచి జెహాన్ నోటి క్యాన్సర్‌తో బాధపడుతోందని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ పేర్కొన్నారు. నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధృవీకరించారు. దీంతో ఆమె కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

వారి బంధుత్వమిదే..
జెహాన్ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. అదే విధంగా షారుక్ కుటుంబంతో నూర్ జెహాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి భారత్‌లో కూడా చాలామంది బంధువులు ఉన్నారు. కింగ్‌ఖాన్ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్‌లోని నూర్ కుటుంబాన్ని రెండుసార్లు(1997,2011) సందర్శించారు.

రాజకీయాల్లోనూ..
నూర్ మరణంతో షారుఖ్, నూర్ జెహాన్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్ జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు. అనంతరం జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు.
Recommended Video

ప్రస్తుతం చర్చల్లో..
ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించబోయే సినిమా ఏంటని అందరూ ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా షారుక్‌కు సరైన హిట్ రాలేదు. అయితే ఈ నేపథ్యంలో షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీటిపై ఆ ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.


Click it and Unblock the Notifications











