కాంటా లగా నటి అనుమానాస్పద మృతి.. షెఫాలీ జరివాలా మరణం వెనుక కారణం
బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలీ జరివాలా తాజాగా కన్నుమూసింది. చిన్న వయస్సులోనే ఆమె తుదిశ్వాస విడవటంలో ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇంతకీ ఆమె మరణానికి కారణం ఏంటనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక షెషాలీ జరివాలా ముంబైలో కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
42 ఏళ్లలోనే గుండెపోటుతో..
నటిగా, మోడల్ గా అలరించిన షెఫాలి జరివాలా 42 ఏళ్లకే మృతి చెందింది. తను గుండెపోటుతో మృతి చెందినట్టు బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ సినీ నిపుణులు ధృవీకరిస్తున్నారు. జూన్ 27న రాత్రి షెఫాలీ జరివాలా కన్నుమూసినట్టు తెలుస్తోంది. ముంబైలోని బెల్లేవ్ ఆసుపత్రిలో ఆమెను తన భర్త చేర్పించారు. తీసుకువచ్చిన వెంటనే ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారని సమాచారం. ఆమె భర్త పరాగ్ త్యాగి నుంచి ఇప్పటికీ షెఫాలీ జరివాలా మృతిపై ఎలాంటి స్పందన లేదు. కానీ భర్త పరాగ్ త్యాగి తోపాటు మరో ముగ్గురు షెఫాలీ జరివాలాను ఆస్పత్రికి తీసుకెళ్లి, బయటికి తీసుకొచ్చారని బాలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి.

మరణానికి గల కారణం..
షెఫాలి జరివాలా మరణ వార్తను మొదట హిందీ జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. అయితే షెఫాలీని ముంబైలోని అంధేరి ఎదురుగా ఉన్న బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురావడానికి 45 నిమిషాల ముందే మరణించినట్టు తెలుపుతున్నారు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆమె గుండెపోటుతో మరణించిందని అంటున్నారు. కానీ మరోవైపు ఇంత చిన్న వయస్సులో షెఫాలీకి హార్ట్ ఎటాక్ వచ్చిందా? మరేదైనా కారణం ఉందా? అని సందేహిస్తున్నారు. అయితే ఆస్పత్రి వైద్యులు కూడా షెఫాలీ జరివాలా మరణంపై స్పందించలేదు. డాక్టర్ లుల్లా, సుశాంత్ లు షెఫాలీ మరణానికి సంబంధించిన కారణాలను ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం. కానీ ఆమె మృత దేహాన్ని మాత్ర పోస్టు మార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారని బాలీవుడ్ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
షెఫాలీ జరివాలా వివరాలు..
నటి, మోడల్ షెఫాలీ జరివాలా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో 1982 డిసెంబర్ 12న జన్మించింది. ముంబైలోని సర్దార్ పటేల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. ఆ తర్వాత కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేయాలని అనుకుంది. ఇక ఈమె 2004లో మీట్ బ్రదర్స్ కు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ హర్మీత్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. 2009లో విడిపోయింది. ఇక 2015లో పరాగ్ త్యాగిని రెండో వివాహాం చేసుకుంది. వీరు ముంబైలోనే నివాసం ఉంటున్నారు.
కాంటా లగా గర్ల్ గా గుర్తింపు..
20 ఏళ్లలోనే షెఫాలీ జరివాలాకు మోడల్ గా, నటిగా మంచి గుర్తింపు దక్కింది. 2002లో కాంటా లగా అనే వీడియో ఆల్బమ్ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అనేక మ్యూజిక్ ఆల్బమ్స్, రియాలిటీ షోల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అక్షయ్ కుమార్, సల్మాన్ తో కలిసి ముజ్సే షాది కరోగి చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో 'ఐతే ఏంటీ' అనే చిత్రంలోనూ నటించింది. 2020లో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలోనూ మెరిసింది.


Click it and Unblock the Notifications











