శిల్పాశెట్టి భర్తకు సమన్లు.. రాజ్ కుంద్రా విషయంలో ఏం జరుగుతుందంటే!
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ సోమవారం ఆదేశించింది. రాజ్ కుంద్రా నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సమన్లు జారీ చేశామని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద విచారిస్తున్నామని అధికారులు మీడియాకు సమాచారం అందించారు.
బాప్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో జరిపిన ఆర్థిక లావాదేవీలో అవకతవకలు ఈడీ దృష్టికి రావడంతో గ్యాంగస్టర్ ఇక్బాల్ మిర్చిని గతంలో అరెస్ట్ చేశారు. ముంబైలోని విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన లావాదేవీల్లో అనేక సందేహాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహరంలో క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో ఉండగానే మిర్చి 2013లో గుండెపోటుతో మరణించారు. అదే విధంగా పలు ఆర్థిక అంశాల్లో అవకతవకలు రావడంతో వ్యాపారవేత్త రంజిత్ బింద్రాను అరెస్ట్ చేసింది.

ఈ మనీలాండరింగ్ కేసులో దూకుడు ప్రదర్శిస్తుండటంతో రాజ్ కుంద్రా స్పందించారు. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమే. తనకు ఈ వ్యవహారంలో సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ అధికారులు సమన్లు పంపడంతో కేసు మరోసారి మీడియాలో ప్రధాన్యం సంతరించుకొన్నది.
ఈ మనీలాండరింగ్ కేసు రాజ్ కుంద్రాకు మెడకు చుట్టుకునే అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయం సీని, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి ఎలా బయటపడుతారనే విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఈ కేసు విచారణకు రాజ్ కుంద్రా ఎప్పుడు హాజరవుతారనే విషయం కీలకంగా మారింది.


Click it and Unblock the Notifications











