షోలే నటుడు కన్నుమూత.. షాక్‌లో సినీ ప్రముఖులు
భారతీయ సినిమా చరిత్రలో షోలే సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. హిందీ సినిమా బాక్సాఫీస్ తలరాతను మార్చిన చిత్రంలో నటించిన మరాఠీ యాక్టర్ విజు ఖోటే కన్నుమూశారు. ఈ చిత్రంలో కాలియా అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజు సెప్టెంబర్ 30 తేదీ ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో హిందీ సినీలోకం షాక్ గురైంది. అమితాబ్, ధర్మేంద్ర, అమ్జద్ ఖాన్ నటించిన ఈ చిత్రం సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే.
షోలే సినిమాతోపాటు అందాజ్ అప్నా అప్పా అనే చిత్రంలో రాబర్ట్ పాత్రలో విజు ఖోటే అద్భుతంగా నటించారు. సర్దార్ మైనే ఆప్కా నమక్ ఖాయా హై.. గల్తీ సే మిస్టేక్ హోగయా అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఈ జనరేషన్ వారికి కూడా దగ్గర చేశాయి. సినిమా రంగంలోనే కాకుండా బుల్లితెరపైన విశేషంగా రాణించారు. 1964లో యా మలక్ అనే చిత్రంతో కెరీర్‌ను ఆరంభించిన ఆయన 300 చిత్రాలకుపైగా నటించారు. కేవలం హిందీకే పరిమితం కాకుండా మరాఠీలో తన ప్రతిభను చాటుకొన్నారు.

విజు ఖోటే పండించే హాస్యానికి విభిన్నమైన శైలి ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటాయి. అలాంటి వినూత్న నటుడు ఇక లేరనే వార్తతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాపంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటూ.. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకొంటున్నారు.
నటుడు విజు ఖోటే సినీ నేపథ్యం ఉంది. ఆయన సోదరి శుభా ఖోటే నటి. ఆయన తండ్రి నందు ఖోటే మరాఠీ రంగస్థల నటుడే కాకుండా మూకీ చిత్రాల్లో కూడా నటించారు.


Click it and Unblock the Notifications











