కనికాకపూర్‌కు తీరని కష్టాలు.. మరో రెండు కేసులు.. పోలీసుల సీరియస్
కరోనావైరస్ సోకిన విషయాన్ని దాచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే వివాదంలో కూరుకుపోయిన కనికాకపూర్‌కు మరో ముప్పు పొంచివుంది. కొద్ది రోజుల క్రితం కరోనా నెగిటివ్ అని తేలడంతో డిశ్చార్జి అయిన ఆమె ప్రస్తుతం లక్నోలో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

లండన్ పర్యటన నుంచి
ఇటీవల లండన్ పర్యటన నుంచి నేరుగా భారత్ వచ్చిన కనికాకపూర్ లక్నో విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేదనేది ప్రధాన ఆరోపణ. కరోనా లక్షణాలతో ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేయడం, అలాగే మాజీ సీఎం వసుంధర రాజే కుటుంబ విందుకు హాజరుకావడం మరింత వివాదాస్పదమైంది.

లక్నో హాస్పిటల్‌లో
కరోనా పాజిటివ్ అని తేలడంతో మార్చి 20న ఆమెను లక్నోలోని సంజయ్ గాంధీ మెమొరీయల్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత ఏప్రిల్ మూడో తేదీ వరకు నిర్వహించిన ఐదు నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో సుమారు 14 రోజుల పాటు హాస్పిటల్‌కే పరిమితమయ్యారు. ఆరోసారి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో డిశ్చార్చి చేశారు.

నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని
కనికా వ్యవహారంపై లక్నో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ స్పందిస్తూ.. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదును మేము పరిగణనలోకి తీసుకొన్నాం. కరోనావైరస్ సోకిన తర్వాత ఆమె నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రాణాంతక వ్యాధి విస్తరించడానికి పరోక్షంగా కారణమయ్యారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందింది అని అన్నారు.

మరో రెండు కేసులు
కనికాకపూర్‌కు సంబంధించి మరో రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్, గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కనికాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆమె 14 రోజుల గృహ నిర్బంధం ముగిసిన తర్వాత పోలీసుల ప్రశ్నిస్తారు అని దినేష్ కుమార్ పేర్కొన్నారు.
Recommended Video

పలు సెక్షన్ల కింద కేసులు
కాగా, కనికా కపూర్‌పై భారతీయ శిక్షాసృతి కింద పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. హాస్పిటల్ ఛీప్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆమెపై సెక్షన్ 188, 269, 270 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలో కరోనా నుంచి బయటపడినా.. ఆమెను ఈ వ్యాధి మరో రూపంలో వెంటాడటం ఖాయమనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











