జియా ఖాన్ కేసులో తొలిసారి స్పందించిన సూరజ్ పంచోలి
బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆరేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు, బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి కారణం అంటూ ముంబై సెషన్స్ కోర్టులో ఈ ఏడాది జనవరి 30న ఐపిసి 306 సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
ఇంతకాలం జియా ఖాన్ ఆత్మహత్య సంఘటన, తనపై వస్తున్న ఆరోపణలపై మౌనం వహించిన సూరజ్ తన 28వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి నోరు విప్పాడు. గత ఆరేళ్లుగా తనను అందరూ హంతకుడని, క్రిమినల్ అని, అబ్యూసర్ అని అంటుంటే తాను ఎంత బాధ పడ్డానో చెప్పే ప్రయత్నం చేస్తూ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.

తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించు కోవడానికి ఒక ఫెయిర్ చాన్స్ కూడా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా సూరజ్ పంచోలి ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి పోస్ట్ ఇపుడు అందరినీ ఆలోపించజేస్తోంది.
2013 జూన్ 3న జియా ఖాన్ ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తన ప్రియుడు సూరజ్ పంచోలి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
2013 అక్టోబర్లో జియా ఖాన్ తల్లి రబియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురుది ఆత్మహత్య కాదని, హత్య చేయబడిందని... ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. 2014 జులైలో ముంబై పోలీసుల నుంచి కేసు సిబిఐకి బదిలీ అయింది.


Click it and Unblock the Notifications