Sunny Deol : కెరీర్ క్లోజ్ అనుకుంటే .. 700 కోట్లతో సంచలనం, 70 ఏళ్ల వయసులో ఖాన్‌లకి సవాల్
సక్సెస్ కొట్టినవాడినే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్లు.. సినీ పరిశ్రమలోనూ విజయాలు సాధించిన వాడిదే హవా. హిట్ కొట్టిన వాడి వెంట సినీ జనాలు పరుగులు తీస్తుంటారు. ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా.. ఎన్ని రికార్డులు తన పేరిట ఉన్నా .. ఒక్క ఫ్లాప్ పడితే చాలు స్టార్ హీరో వంక కన్నెత్తి కూడా చూడరు. ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నారు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. కెరీర్ క్లోజ్ అవుతున్న దశలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయి బాక్సాఫీస్‌ను వణిస్తున్నారు సన్నీ.
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర నటవారసుడిగా వెండితెరపై అడుగుపెట్టారు సన్నీ డియోల్. 1983లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో తన తండ్రి నటించిన బేతాబ్ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో సన్నీ డియోల్‌కు అవకాశాలు క్యూకట్టాయి. సోహ్ని మహివాల్, అర్జున్, పాప్‌కి దునియా, త్రిదేవ్, చల్‌భాజ్‌లు హిట్ కావడంతో సన్నీ డియోల్ పేరు మారుమోగింది. ఈ దశలో రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో , ధర్మేంద్ర నిర్మాతగా తెరకెక్కిన ఘయాల్ చిత్రంతో తొలిసారిగా హీరోగా నటించారు సన్నీ. తొలి సినిమాకే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్, నేషనల్ ఫిల్మ్ జ్యూరీ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.

అనంతరం దామిని, డర్, జీత్, ఘాతక్, డిల్లగి, గదర్ ఏక్ ప్రేమ్ కథ, ఇండియన్, అప్నే తదితర చిత్రాలతో సక్సెస్‌లు కొట్టిన సన్నీడియోల్ తర్వాత ఎందుకో వెనుకబడ్డారు. ఆయన సినిమాలు ఒకదాని వెంట ఒకటి బోల్తా కొట్టడంతో సన్నీడియోల్ ప్రభ మసకబారుతూ వచ్చింది. పాతకాలం నాటి యాక్షన్ సినిమాలు, ప్రయోగాలు, మధ్యలో గాయాలు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కారణంగా సన్నీడియోల్ కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది.
ఇలాంటి దశలో గదర్ 2తో సన్నీడియోల్ సంచలనం సృష్టించారు. 1971 భారత్ - పాకిస్తాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆగస్ట్ 11, 2023న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల కలెక్షన్స్ సాధించి సన్నీడియోల్ స్టామినా ఏంటో నిరూపించింది. 2023లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా గదర్ 2 నిలిచింది. ఇంతకాలం తనను విమర్శించిన వారిని సాలీడ్ హిట్‌తో నోళ్లు మూయించారు సన్నీడియోల్.
గదర్ 2 హిట్ తర్వాత 68 ఏళ్ల వయసులో సన్నీడియోల్ తిరిగి బిజీ అయ్యారు. జాట్, లాహోర్ 1947, బోర్డర్ 2, రామాయణ పార్ట్ 1, సఫర్ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీడియోల్ నటించిన జాట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది? గదర్ 2 రికార్డులను బద్ధలు కొడుతుందా? అంటూ బాలీవుడ్ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











