వివాదంలో మృణాల్ మూవీ.. సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పుతో..
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించిన 'ఆంఖ్ మిచోలీ' సినిమా ఫ్లాప్ అయింది. కానీ అందులో వికలాంగులను అవమానించారు అనే వివాదం తీవ్ర దుమారం రేపింది. ఇదే విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిపున్ మల్హోత్రా కేసును దాఖలు చేయగా, తాజాగా సుప్రీం కోర్టు ఈ వివాదంపై జడ్జిమెంట్ ను వెల్లడించింది. అంతేకాకుండా వికలాంగులపై సినిమాలు తీసేటప్పుడు తప్పనిసరిగా మేకర్స్ పాటించాల్సిన రూల్స్ ను వెల్లడించింది న్యాయస్థానం. మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంఖ్ మిచోలి చిత్రంలో పరేష్ రావల్, అభిమన్యు దస్సాని, మృణాల్ ఠాకూర్, దివ్య దత్తా, శర్మన్ జోషి, అభిషేక్ బెనర్జీ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. 2023 నవంబర్ 3న విడుదలైన ఈ చిత్రానికి ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ కు కంటిచూపు పోతుంది. అలాంటి అమ్మాయి లోపాన్ని దాచిపెట్టి ఓ సంపన్నమైన ఎన్ఆర్ఐకి ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో మతిమరుపుతో బాధపడుతున్న తండ్రి పాత్రలో పరేష్, అభిషేక్ నత్తి వల్ల బాధపడుతున్నట్టు సినిమాలో చూపించారు.

నిజానికి 'ఆంఖ్ మిచోలీ' అనేది కామెడీ ఫ్యామిలీ మూవీ. కానీ ఈ సినిమాకు కలెక్షన్ల కంటే ఎక్కువ వివాదాల్లోనే చిక్కుకుంది. ఈ సినిమాలో వికలాంగుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను చిత్రబృందం ఉపయోగించిందని నిపున్ మల్హోత్రా దావా వేశారు. CCPD అని పిలువబడే వికలాంగుల ప్రత్యేక కోర్టు, నిర్మాతలు, సెన్సార్ బోర్డ్‌కు నోటీసు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే 2024 జూలై 8న, భారత సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వికలాంగులను చలనచిత్రాలు ఎలా చూపించాలో నియమాలను రూపొందించింది. మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్ నటించిన ఆంఖ్ మిచోలీ చిత్రంపై వికలాంగ పాత్రలను అవహేళన చేస్తూ చూపించడంపై వచ్చిన ఫిర్యాదు తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం. భారతీయ చలనచిత్రాలలో తరచుగా వికలాంగులను అగౌరవంగా, కించపరిచే విధంగా డైలాగ్స్, లేసా సీన్స్ ద్వారా ప్రజలను నవ్వించడానికి కామెడీని రూపొందిస్తారు మేకర్స్. ఇది బాలీవుడ్ నుంచి దక్షిణ భారత సినిమాల వరకు అన్ని వుడ్స్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు మాట్లాడుతూ సినిమాల్లో వికలాంగులను కచ్చితంగా గౌరవంగా చూపించాలని సూచించారు. ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దానిపై సినిమాలు పెద్ద ప్రభావాన్ని చూపుతాయని, వికలాంగులను తప్పుగా చూపించడం హానికరమైన మూస పద్ధతులకు కారణమవుతుందని అన్నారు. మేకర్స్ వికలాంగుల గౌరవాన్ని, వివక్ష నిరోధక చట్టాన్ని గౌరవించాలని, కేవలం మూస పద్ధతులే కాకుండా వారి నిజ జీవితాలను సినిమాలుగా చూపించాలని కోర్టు పేర్కొంది.

వైకల్యాల గురించిన హాస్యం ప్రజలు వికలాంగులను అర్థం చేసుకోవడంలో సహాయపడాలని, వారిని ఎగతాళి చేయడం కాదని కోర్టు సూచించింది. దీంతో వికలాంగుల హక్కుల కార్యకర్తలు, సినీ పరిశ్రమలోని ప్రజలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇది వికలాంగుల గురించి మరింత సున్నితమైన, బాధ్యతాయుతమైన ఆలోచనకు దారి తీస్తుందని అంటున్నారు.
రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులతో సహా విజువల్ మీడియా కంటెంట్‌ను రూపొందించడంలో పాల్గొనే వ్యక్తులకు శిక్షణ, సున్నితత్వ కార్యక్రమాలను అమలు చేయాలని, మేకర్స్ కు క్రియేటివిటీ పేరుతో ఇప్పటికే అట్టడుగున ఉన్నవారిని తప్పుగా సూచించే లేదా కించపరిచే స్వేచ్ఛ ఉండదని కోర్టు పేర్కొంది.


Click it and Unblock the Notifications











