ఆకాశం నీ హద్దురా హిందీలోకి రీమేక్.. డైరెక్టర్, హీరో ఎవరంటే!
విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. దక్షిణాదిలో అతిపెద్ద విజయాన్ని అందుకొన్న ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రముఖులు కన్నేశారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ఊపందుకొన్నాయి. అయితే ఈ హిందీ రీమేక్ గురించిన సమాచారం ఇలా ఉంది...

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసక్తి
ఆకాశం నీ హద్దురా సినిమా చూసిన తర్వాత హిందీలోకి పునర్మించాలని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం దర్శకులు, హీరో సూర్యతో సంప్రదింపులు జరుగుతున్నాయి. దాదాపు చర్చలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గాల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది అని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

హిందీలోకి సుధా కొంగర
హిందీలో రూపొందే ఆకాశం నీ హద్దురా చిత్రానికి కూడా సుధా కొంగర దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళ చిత్రం సురారై పొట్రూ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. హిందీలో ప్రముఖ నటుడు సూర్య పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇటీవల సుధా కొంగర చేసిన ట్వీట్ కూడా అందుకు బలంగా మారింది.

త్వరలోనే నా తదుపరి సినిమా వివరాలు
ఆకాశం నీ హద్దురా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సుధా కొంగర ట్వీట్ చేస్తూ.. నా తర్వాత సినిమా విషయానికి సంబంధించిన వివరాలు త్వరలోనే చెబుతాను. నా తదుపరి సినిమా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అనేది ఆతృతంగా ఉంది అంటూ సుధా కొంగర ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడి జీవితం ఆధారంగా
ఆకాశం నీ హద్దురా చిత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ జీవితంపై వచ్చిన సింప్లి ఫ్లై అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











