రియా చక్రవర్తి మెడకు బిగిసిన ఉచ్చు.. సుశాంత్ తండ్రి కేసు నమోదు.. అడ్డంగా బుక్కైన లవర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో మంగళవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఇప్పటి వరకు నిస్తేజంగా సాగుతున్న ముంబై పోలీసుల దర్యాప్తుపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీహార్‌లో సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజా కేసు గురించి వివరాల్లోకి వెళితే..
Recommended Video

రియాపై పాట్నా పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు
జూలై 28 తేదీ (మంగళవారం) పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై కేసు నమోదైంది. ఆమెపై కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ సూసైడ్‌కు సహకరించిందని, అలాగే చీటింగ్, కుట్ర ఆరోపణలపై పోలీసులు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సుశాంత్ మరణానికి కుట్ర
సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి కుట్ర పన్నారు. అతడి నుంచి భారీగా సొమ్ము తీసుకొని ఆత్మహత్యకు కుట్రపన్నారు. నా కుమారుడిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించింది అని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ ఫ్యామిలీ ఇలా తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం, పోలీసులకు ముందుకు రావడం ఇదే మొదటిసారి.

రియా చక్రవర్తిపై నమోదైన కేసులు ఇవే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు అని పాట్నా సెంట్రల్ జోన్, ఐఐజీ సంజయ్ సింగ్ ధృవీకరించారు. ఇప్పటికే పాట్నా పోలీసు బృందం ముంబైలో దర్యాప్తు మొదలుపెట్టింది అని తెలిపారు.

రియా చక్రవర్తిని 11 గంటల విచారణ
గతంలో సుశాంత్ సింగ్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు రియా చక్రవర్తిని దాదాపు 11 గంటలపాటు విచారించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బును వాడుకొన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణలో రియా కీలకంగా మారింది.

సీబీఐకి అప్పగించాలని అమిత్ షాకు రియా లేఖ
కాగా, సుశాంత్ మరణం కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటీవల రియా చక్రవర్తి కూడా స్పందించారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం చర్చనీయాంవమైంది. తాజాగా పాట్నాలో కేసు నమోదు కావడంతో ఈ కేసు రియా మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











