రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి 7 సంచలన ఆరోపణలు.. కేకే సింగ్ సంధించిన ప్రశ్నలు ఇవే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎన్నో ప్రశ్నలు సగటు ప్రేక్షకుడిని, పాఠకులను వెంటాడుతున్నాయి. సుశాంత్ మరణానికి కారణమేమిటనే విషయంపై ఓ పక్క ముంబై పోలీసులు విచారణ జరుపుతుంటే మరో పక్క బీహార్ పోలీసులు కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ హీరోయిన్ రియా చక్రవర్తిపై చేసిన పలు ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇంతకు కేకే సింగ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..
ముంబై పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ జూలై 25వ తేదీన హీరోయిన్ రియా చక్రవర్తిపై పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బీహార్‌లోని పాట్నా పోలీసులు రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేకే తన ఫిర్యాదు పలు ఆరోపణలు చేస్తూ పిటిషన్ సమర్పించారు.

రియా చక్రవర్తితో అఫైర్ తర్వాతే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019కు ముందు ఎలాంటి మానసిక రుగ్మత, కానీ ఇతర మానసిక సమస్యలతో బాధపడలేదు. రియా చక్రవర్తితో సంంధాలు పెట్టుకొన్న తర్వాతే సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యాడనే విషయాలు ప్రచారమయ్యాయి. రియా చక్రవర్తితో అఫైర్ తర్వాత సుశాంత్‌కు ఏం జరిగింది? అనే విషయంపై వాస్తవాలు బయటపెట్టాలి అని కేకే సింగ్ ఆరోపించారు.

సుశాంత్ వైద్యానికి కుటుంబ అనుమతి ఎందుకు తీసుకోలేదు
ఒకవేళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్ గురైతే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు. ఒకవేళ సుశాంత్ మానసిక సమస్యలతో బాధపడితే జరిపించే చికిత్స విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎందుకు రాతపూర్వకంగా లేదా వేరే ఇతర రూపంలో అనుమతి ఇందుకు తీసుకోలేదు? ఈ విషయంలో రియాపై అనేక అనుమానాలు మాకు ఉన్నాయి అని కేకే సింగ్ తన ఫిర్యాదులో తెలిపారు.

సుశాంత్‌కు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారు
సుశాంత్ సింగ్ డిప్రెషన్ తగ్గించడానికి హీరోయిన్ రియా చక్రవర్తి ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించారు. ఆమె సూచనలు, సలహాలతో సుశాంత్‌కు ఎలాంటి వైద్యం, మెడిసిన్స్ ఇచ్చారో బహిర్గతం చేయాలి అని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుశాంత్‌ను ఎందుకు వదిలేసి వెళ్లింది?
లాక్‌డౌన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రియా చక్రవర్తి కలిసి సహజీవనం చేసింది. అయితే సుశాంత్ ఆరోగ్య, మానసిక పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే రియా ఉన్నట్టుండి అతడిని వదిలేసి అపార్ట్‌మెంట్ నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఒకవేళ సుశాంత్ ఆరోగ్యం క్షీణించడానికి కారణం ఏమిటి రియా విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది అని కేకే సింగ్ ఆరోపించారు.

సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ఎక్కడికి?
సుశాంత్‌కు సంబంధించిన కొటాక్ మహీంద్ర బ్యాంక్ నుంచి తన కుమారుడికి సంబంధం లేని అకౌంట్‌కు రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. వాటిని ఎవరు? ఎందుకు? ట్రాన్స్‌ఫర్ చేశారో రియా చక్రవర్తి బయటకు చెప్పాలి? సుశాంత్ డబ్బును చాలా రకాలుగా రియా వాడుకొన్నది. వాటన్నింటి వివరాల కూపీ లాగాల్సిందే.

రియాతో అఫైర్ తర్వాత ఆఫర్లు ఎందుకు తగ్గాయి?
సుశాంత్ సింగ్‌ను కొన్ని వర్గాలు అణగదొక్కేందుకు ప్రయత్నించినా... ఆయన నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. బాలీవుడ్‌లో సుశాంత్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. రియా చక్రవర్తితో అఫైర్ తర్వాత సుశాంత్‌కు సినిమా ఆఫర్లు ఎందుకు తగ్గాయో అనే విషయాన్ని బయటపెట్టాలి. ఈ విషయంలో రియాను విచారిస్తే అసలు కుట్రలు బయటపడుతాయి అనే అరోపణను కేకే సింగ్ తన ఫిర్యాదులో పొందుపరిచారు.

సుశాంత్ వ్యవసాయం చేస్తానంటే రియా ఎందుకు అడ్డుకొన్నది?
ఓ దశలో బాలీవుడ్‌కు దూరంగా బతకాలని నిర్ణయం తీసుకొన్నారు. తన స్నేహితుడు మహేష్‌తో కలిసి కూర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే అలాంటి వ్యవసాయం చేయకుండా రియా ఎందుకు అడ్డుకున్నది అనే విషయంపై వెనుక ఆమె చేసిన కుట్రను బయటపెట్టాలి అని కేకే సింగ్ మరో ప్రశ్నను సంధించారు.
Recommended Video

జోరందుకున్న సీబీఐ డిమాండ్
ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో రియా చక్రవర్తి వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా మారడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై పోలీసుల విచారణపై సందేహాలు వ్యక్తం కావడం, బీహార్ పోలీసులు తమ పరిధిలో విచారణ జరపడానికి రంగంలో దిగడం జరిగింది.


Click it and Unblock the Notifications











