ఆ సినిమా విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. తాప్సీ కామెంట్స్
ఝుమ్మందినాదం సినిమాతో సినీ రంగానికి పరిచయమైంది అందాల తాప్సీ. అయితే కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ డాల్‌గానే చూసిన జనాలు.. తాప్సీలోని ప్రతిభను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది తాప్సీ. స్టార్ హీరో రేంజ్‌లో తాప్సీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నాయి.

ప్రయోగాలకు పెద్ద పీఠ..
గ్లామరస్ పాత్రలకు గుడ్ బై చెప్పిన తాప్సీ.. ప్రస్తుతం ప్రయోగాలకు పెద్దపీఠ వేస్తోంది. పింక్, బాద్లా, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్ వంటి చిత్రాలతో భారీ హిట్టు కొట్టింది తాప్సీ. కేవలం ఉత్తరాదినే కాకుండా.. దక్షిణాదిన కూడా ఫుల్ బిజీగా మారుతోంది. సినిమాలతోనే కాకుండా.. బయట కూడా తాప్సీ ఇచ్చే కౌంటర్స్‌తో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కూడా పడింది.

మీడియాకు కౌంటర్..
ఐఫా వేడుకల్లో పాల్గొన్న తాప్సీకి మీడియా నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఆమె పూర్తిగా ఇంగ్లీష్‌లో సమాధానాలు చెబుతుండటంతో సదరు మీడియా ప్రతినిధి.. మీరు హిందీ నటి కదా.. ఇంగ్లీష్‌లోనే ఎందుకు మాట్లాడుతున్నారు.. హిందీలో మాట్లాడవచ్చు కదా? అని ప్రశ్నించాడు. తాను కేవలం హిందీ నటిని కాదని, తాను దక్షిణాది నుంచి వచ్చానని, తెలుగు, తమిళ్‌లో మాట్లాడమంటారా? అని రివర్స్ కౌంటర్ వేసింది.

ఆ మధ్య అమితాబ్‌పై..
సాండ్ కీ ఆంఖ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. బాద్లా విషయంలో తాను ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. అది కేవలం అమితాబ్ చిత్రం కాదు.. అందులో తాను కూడా ఉన్నానని, తన పాత్రకు కూడా ప్రాధాన్యముందని చెప్పుకొచ్చింది. అయితే అది అమితాబ్ చిత్రమేనని ప్రొజెక్ట్ చేశారని తెగ బాధపడింది.

వివరణ ఇచ్చిన తాప్సీ..
తాజాగా ఇదే విషయంపై ‘తప్పడ్' ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. తానేమీ అమితాబ్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని.. పనిగట్టుకొని తప్పు పట్టలేదని చెప్పుకొచ్చింది. బాద్లా సినిమాలో తన పాత్ర నిడివి తక్కువేం కాదని.. అయినప్పటికీ అది అమితాబ్ సినిమాలా చూపించారని అన్నట్లు పేర్కొంది. తనకు సినిమా ప్రచార పోస్టర్లలో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











