72 కోట్ల ఆస్తిని వదులుకున్న స్టార్ హీరో.. అభిమాని చివరి కోరిక నిరాకరణ
భారతదేశంలో సినీతారలను అభిమానులు దేవుళ్లలాగా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. కన్నవారు, సన్నిహితుల కంటే హీరో హీరోయిన్లనే ఎక్కువగా ప్రేమించే వాళ్లు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే వాతావరణం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఈ కల్చర్ కాస్త ఎక్కువ. అభిమాన తారల కోసం ఏకంగా గుడి కట్టేంత పిచ్చి ఫ్యాన్స్ సౌత్‌లో ఉన్నారు. హీరోల కోసం ఆస్తుల్ని అమ్ముకుని కార్యక్రమాలు నిర్వహించిన వారు ఉన్నారు. అయితే ఓ మహిళా అభిమాని మాత్రం తన అభిమాన హీరోకి ఏకంగా 72 కోట్ల రూపాయల విలువైన తన యావదాస్తిని రాసిచ్చేసింది. అయితే హీరోగారు మాత్రం తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచి ఆ ఆస్తిని తిరిగి ఇచ్చేశారు. ఇంతకీ ఎవరా హీరో? ఆ అభిమాని ఎందుకు ఆస్తిని రాసిచ్చింది ఈ వివరాల్లోకి వెళితే..
45 ఏళ్లుగా సినీ ప్రస్థానం
ఆ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. బాలీవుడ్ అగ్రనటులు సునీల్ దత్, నర్గీస్ దత్‌ల కుమారుడే సంజయ్ దత్. నాలుగున్నర దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు సంజయ్ దత్. సినిమాలలో సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకున్న ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కుని, చివరికి జైలుకు కూడా వెళ్లొచ్చారు. 1981లో తండ్రి దర్శకత్వంలో వచ్చిన రాకీ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్.. విభిన్నమైన సినిమాలు చేసి క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని అలరించారు.

308 మందితో ఎఫైర్
వ్యక్తిగత జీవితంలో పలువురు హీరోయిన్స్‌తో డేటింగ్ చేసి విలాస పురుషుడిగా పేరు తెచ్చుకున్నాడు సంజయ్ దత్. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఆయన ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్‌గానే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. తన జీవితంలో ఏకంగా 308 మందికి పైగా మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు సంజయ్ దత్ స్వయంగా వెల్లడించాడు. వీరిలో పలువురు స్టార్ హీరోయిన్లు, మహిళా నటులు కూడా ఉన్నారని చెప్పాడు.
జైలుశిక్షను అనుభవించిన సంజయ్
టీనా మునిమ్ నుంచి మాధురీ దీక్షిత్ వరకు చాలా మంది టాప్ హీరోయిన్లు సంజయ్ దత్‌తో ప్రేమాయణం సాగించిన వారే. సంజయ్ దత్ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. డ్రగ్స్‌కు బానిసై .. కొన్ని రోజుల పాటు సినిమాలకు సైతం దూరమయ్యాడు. 1993 బాంబు పేలుళ్ల కేసు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు వంటి కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం సంజయ్ దత్.. తెలుగులో అఖండ 2, ది రాజా సాబ్, హిందీలో దురంధర్, బాప్.. పంజాబీలో షేరన్ కీ కమ్ పంజాబీ, కన్నడంలో కేడీ- ది డెవిల్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంత జరిగినా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.
సంజయ్ దత్‌కి ఆస్తి రాసిచ్చిన అభిమాని
కాగా.. నిషా పాటిల్ అనే 62 ఏళ్ల మహిళకి సంజయ్ దత్ తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గీస్ దత్ అంటే ఎంతో అభిమానం. వారిని ఏనాడూ వ్యక్తిగతంగా కలవలేదు. వారి తర్వాత వారి వారసుడు సంజయ్ దత్‌ను చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించింది. 2018లో నిషా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తన ఎస్టేట్ మొత్తాన్ని తన తదనంతరం సంజయ్ దత్‌కి చెందేలా వీలునామా రాయించారు నిషా. అలాగే తన సంపదనంతా హీరోకి బదిలీ చేయించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.
72 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన సంజయ్ దత్
దాదాపు ఆరేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన నిషా.. ఇటీవలే కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఆమె రాసిన వీలునామా వార్త వెలుగులోకి రాగా.. తనపై నిషా చూపించిన అభిమానానికి చలించిపోయారు సంజయ్ దత్. అలాంటి అభిమానాన్ని పొందడం తన అదృష్టమని పేర్కొన్న ఆయన .. నిషా రాసిన ఆస్తిని తిరస్కరించారు. ఆ ఆస్తిని నిషా కుటుంబ సభ్యులకే తిరిగి ఇచ్చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ తెలిపారు. నిషాను కలుసుకోలేకపోయానని.. కానీ ఆమె కుటుంబ సభ్యుల్ని త్వరలోనే కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











