ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు: ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ అఫీషియల్ ట్రైలర్
Recommended Video

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులంతా బాహుబలి కోసం ఎంత ఆసక్తిగా ఎదరు చూశారో.... ఇపుడు బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ నటించిన ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాజా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇండియాకు వచ్చిన 1795 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు.

అమితాబ్ బచ్చన్ కళ్లు చేదిరే యాక్షన్ సీన్లు
అందరినీ ఆశ్చర్య పరుస్తూ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కళ్లు చెదిరేలా యాక్షన్లు చేస్తూ కనిపించారు. అమితాబ్ బచ్చన్‌ను యుద్ధ వీరుడిగా చూపించారు. నౌకలపై కత్తి యుద్ధాలు చేస్తూ బిగ్ బి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని స్పష్టం అవుతోంది. థగ్స్ కమాండర్ ఖుదాభక్ష్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.

అమీర్ ఖాన్
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. థగ్స్ గ్రూపుకు చెందిన ఆజాద్... ఫిరంగి ముల్లాహ్‌గా పేరు మార్చుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో చేతులు కలిసి కమీనే వేషాలు వేస్తూ వారిని బోల్తా కొట్టించే పాత్రలో కనిపిస్తాడని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

గ్లామర్ లేడీగా కత్రినా కైఫ్
ఇక కత్రినా కైఫ్ ఈ చిత్రంలో తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయబోతోంది. కత్రినాపై చిత్రీకరించిన గ్లామరస్ సాంగ్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

వీర వనితగా ఫాతిమా సనా షేక్
మరో బాలీవుడ్ నటి ఫాతిమా సనా సేక్ ఈచిత్రంలో..... థగ్స్ తరుపున పోరాడే వీరవనితగా కనిపించబోతోంది. విలువిద్యలో ఆరితేరిన ఆమె విన్యాసాలు సైతం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నాయి.
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్
ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ధూమ్ 3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిలిప్ మీడో రచించిన 1839 నాటి ఫిక్షన్ నవల... కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. నవంబర్ 8న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











