‘257 మంది అమాయకులు బలి.. ఇంట్లో AK 47 దాచి.. ఆ స్టార్ హీరో మౌనం’
భారత్ - పాకిస్తాన్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచి నేటి వరకు కాశ్మీర్ గురించి మనతో పోరాడుతూనే ఉంది. 1948, 1965, 1971, కార్గిల్, తాజా సర్జికల్ స్ట్రైక్స్ వరకు భారత్‌తో ప్రత్యక్ష యుద్ధాల్లో తలపడలేని పాకిస్తాన్ మనల్ని దొంగ దెబ్బ కొడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారిని సరిహద్దులు దాటించి మనదేశంలో మారణకాండ సృష్టిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బాంబు దాడులు, కాల్పులకు తెగబడుతూ లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది.
ఇండియాలో పాక్ నెట్‌వర్క్
మనదేశంలోని కొందరు దేశద్రోహులు.. పాకిస్తాన్‌కు అమ్ముడై సొంతవారిని బలి తీసుకుంటున్నారు. తాజాగా పహల్గామ్ ఉగ్రవాద దాడులు.. దీనిపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత మనదేశంలోని పాకిస్తాన్ నెట్‌వర్క్ గురించి తెలుసుకుని నిఘా సంస్థలే ఆశ్చర్యపోయాయి. అయితే ఇప్పుడే కాదు.. దశాబ్ధాల నుంచే ఇండియాలో పాకిస్తాన్ కోసం పనిచేసేవాళ్లు ఉన్నారు. వీరిలో కొందరు సెలబ్రెటీలు కూడా ఉండటం దురదృష్టకరం.

దేశాన్ని వణికించిన 1993 ముంబై పేలుళ్లు
భారతదేశాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టాలని ముష్కరులు పలుమార్లు ప్రయత్నించారు. దేశానికి వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై మహానగరాన్నే వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే 1993లో జరిగి ముంబై బాంబు పేలుళ్లు.. మనదేశంపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచిపోయింది. 1993 మార్చి 12వ తేదీ శుక్రవారం ముంబై మహానగరంలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.40 గంటల వరకు 13 చోట్ల వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 257 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
దావూద్ కనుసన్నల్లోనే పేలుళ్లు
ఈ ఘటనకు సూత్రధారిగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. అతని సహచరులు టైగర్ మెమెన్, యాకుబ్ మెమెన్, ఈసామెమెన్, యూసుఫ్‌లని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. బాబ్రీ మసీదు విధ్వంసం, దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ పేలుళ్లకు వ్యూహరచన చేసిందని చెబుతారు. ఈ ప్లాన్‌ను దావూద్ ఇబ్రహీం తన గ్యాంగ్‌తో అమలు చేశాడు. ఈ కేసులో మొత్తం 189 మందిని అరెస్ట్ చేసి.. 10 వేల పేజీలతో ప్రత్యేక టాడా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసింది సీబీఐ. నిందితుల్లో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమెన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు.
సంజయ్ దత్ నోరు విప్పాల్సింది
అయితే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తలచుకుంటే ఈ మారణహోమాన్ని ఆపగలిగేవారని అంటున్నారు ఈ కేసును వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్. ఎన్నో సంచలన కేసులను ఉజ్వల్ నికమ్ వాదించారు. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్యకేసు, 1993 ముంబై బాంబు పేలుళ్లు, 26/11 ముంబై దాడుల కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్, 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసులకు ఉజ్వల్ స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. బాధితులకు న్యాయం చేయడానికి పోరాడారు నికమ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఉజ్వల్ నికమ్ .. కాంగ్రెస్ అభ్యర్ధి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయనను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉజ్వల్ మాట్లాడుతూ.. పేలుళ్లకు కొద్దిరోజుల ముందే దావూద్ అనుచరుడు అబూ సలేం ఓ వ్యాన్‌ను తీసుకుని సంజయ్ దత్ ఇంటికి వెళ్లాడని తెలిపారు. అందులో ఏకే 47 తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు ఇతర మందుగుండు సామాగ్రి ఉందని నికమ్ అన్నారు. వీటిలో ఒక్క ఏకే 47 తుపాకీని తన వద్ద ఉంచుకుని మిగిలిన మందుగుండును సంజయ్ తిరిగి ఇచ్చేశాడని తెలిపారు. ఈ కుట్ర, ఆయుధాలకు సంబంధించి సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ నరమేధం జరిగేది కాదని ఉజ్వల్ అభిప్రాయడ్డారు.
శిక్ష అనుభవించిన సంజయ్ దత్
అయితే ముంబై పేలుళ్ల కేసులో అప్పటి స్టార్ హీరో సంజయ్ దత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్ల కేసులో క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ.. అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం సహా పలు కేసులో టాడా కోర్టు సీరియస్ అయ్యింది. సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్షను విధించింది.


Click it and Unblock the Notifications











