‘మణికర్ణిక’ చిత్రానికి కర్ణిసేన వ్యతిరేకం కాదు, ఎవరో కావాలనే ఇదంతా...
శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన... గతేడాది సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' సినిమా విషయంలో చాలా పెద్ద గొడవ చేశారు. వీరి ఆందోళన కారణంగా సినిమా కొంతకాలం వాయిదా పడటంతో పాటు టైటిల్ మార్పు చేయడంతో పాటు, కొన్ని సన్నివేశాలను తొలగించారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'మణికర్ణిక' చిత్రం విడుదల వేళ మరోసారి శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై కర్ణిసేన ఆగ్రహంగా ఉందని, ఆందోళనకు సిద్ధమవుతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వార్తలపై కర్ణిసేన జాతీయ ప్రతినిధి, మాజీ మేజర్ డాక్టర్ హిమాన్షు స్పందించారు. 'మణికర్ణిక' సినిమాకు వ్యతిరేకంగా తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఈ సినిమాను తాము వ్యతిరేకించడం లేదని, ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పేరు వాడుతున్నారని స్పష్టం చేశారు.
మణికర్ణిక సినిమా విషయంలో ఝాన్సీ రాణి ఫ్యామిలీ నుంచి కానీ, కమ్యూనిటీ నుంచి కానీ, ప్రాంతం నుంచి కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు. కర్ణిసేన ఈ సినిమా విషయంలో ఎలాంటి ఆందోళన చేయడం లేదు అన్నారు. ఎవరో మా పేరు చెడగొట్టడానికే ఇలాంటివి చేస్తున్నారని తెలిపారు.
ఝాన్సీరాణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'మణికర్ణిక'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈచిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా దర్శకత్వం వహించారు. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. బ్రిటిష్ వారి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలుఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు.
ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొలైలైంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన అనంతరం పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో.... మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తి చేశారు. నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











