ఆ హీరోయిన్‌తో పెళ్లి పీటల వరకు .. సల్మాన్ బ్యాచిలర్ లైఫ్‌కి కారణం అతనేనా?
భారతీయ చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఉండే పేరు సల్మాన్ ఖాన్. షష్ఠి పూర్తికి దగ్గరైనా ఈ అగ్రనటుడు నేటికీ బ్యాచిలర్ గానే లైఫ్‌ని కొనసాగిస్తున్నాడు. కెరీర్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలతో డేటింగ్, ఎఫైర్స్ నడిపించిన ఈ కండల వీరుడు పెళ్లిపీటలెక్కడంలో మాత్రం విఫలమవుతున్నాడు. వేల కోట్ల సంపద, కోట్ల మంది అభిమానులు, విలాసవంతమైన జీవితం, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ సల్మాన్ అవివాహితుడిగా మిగిలిపోవడం నేటికీ చర్చనీయాంశమే.
దాదాపు 3 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేశారు సల్మాన్ ఖాన్. హిందీ చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఖాన్ త్రయంలో ఆయన ఒకరు. 1965 డిసెంబర్ 27న బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీంఖాన్- సుశీల చారక్ దంపతులకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు సల్మాన్ ఖాన్. ఆయన పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. తల్లిదండ్రులు హిందూ - ముస్లింలకు చెందిన వారు కావడంతో ఆయన రెండు మతాలను పాటిస్తారు.

తండ్రి బాలీవుడ్‌లో స్టార్ రైటర్ కావడంతో సల్మాన్ సులభంగా ఇండస్ట్రీలో ఈజీగా ఎదిగిపోయాడని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. అందరు హీరోల మాదిరిగానే ఆయన కూడా కష్టపడి పైకొచ్చారు. 1988లో ఫలాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత చిన్నాచితకా పాత్రలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ నిలదొక్కుకున్నారు. మైనే ప్యార్ కియా, సనమ్ బేవాఫా, సాజన్ చిత్రాలతో ఇక వెనక్కి తిరిగే అవకాశం రాలేదు.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. సల్మాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆయనను వెంటాడుతున్నాడు. దీంతో సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇక బాలీవుడ్‌లో సల్మాన్ సాగించినన్నీ ప్రేమాయణాలు మరో నటుడికి లేవంటే అతిశయోక్తి కాదు. ఐశ్వర్య రాయ్, సంగీత బిజలానీ, సోమీ అలీ, కత్రీనా కైఫ్, క్లౌడియా సిస్లా, స్నేహా ఉల్లాల్, ఫరియా అలమ్, మెహక్ చాహల్, డైసీ షా, జరైన్ ఖాన్, బ్రూనా అబ్దుల్లా, సమంతా లాక్‌వుడ్ వంటి తారలతో సల్లూభాయ్ డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ టాక్.
అయితే ఇంత మందితో ప్రేమాయణం సాగించినా ఒక్కరినీ కూడా ఆయన పెళ్లి చేసుకోలేకపోయాడు. అయితే అలనాటి హీరోయిన్ జూహీ చావ్లాతో మాత్రం పెళ్లి పీటల వరకు వెళ్లాడు సల్మాన్. 90వ దశకంలో వీరిద్దరి జోడీ బాలీవుడ్‌ను ఊపేసింది. అందంతో పాటు జూహీ వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెలో ప్రేమలో పడ్డ సల్మాన్ ఖాన్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని జూహీ చావ్లా తండ్రి వద్ద ప్రస్తావించగా ఆయన ససేమిరా అన్నారట.
ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. జూహీ చావ్లా కూడా సల్మాన్ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన విషయాన్ని ధ్రువీకరించారు . బహుశా తామిద్దరం అప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటూ ఉండటం వల్ల మా పెళ్లి జరగలేదన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. నాటి నుంచి పెళ్లికి దూరంగా ఉన్న సల్మాన్.. ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవేళ జూహీని కనుక సల్మాన్ పెళ్లాడి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి.


Click it and Unblock the Notifications











