17 ఏళ్లుగా పగతో రగిలిపోతూ.. షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు!
బాలీవడ్ బాద్షా షారుఖ్ స్టైల్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఐదు పదుల వయసులో కూడా షారుఖ్ మైంటైన్ చేస్తున్న ఫిట్ నెస్ చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. తాజాగా షారుఖ్ ఖాన్ కు ఓడిశాలోని ఓ వర్గం నుంచి బెదిరింపులు వచ్చాయి. షారుఖ్ పై వీళ్లకు ఉన్న కోపం ఈనాటిది కాదు. షారుఖ్ ఖాన్ త్వరలో ఒడిశాలో జరిగే హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి ఉంది. ఈ వేడుకకు హాజరైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

27న మెన్స్ హాకీ ప్రపంచ కప్
ఈ నెల 27 నుంచి మెన్స్ హాకీ ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ షారుఖ్ ని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించిన షారుఖ్ 27న ఒడిశా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి.

తగిన శాస్తి చేస్తాం
షారుఖ్ క్షమాపణలు చెప్పకుండా ఒడిశాలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కళింగ సేన నాయకులూ బహిరంగ ప్రకటన చేశారు. షారుఖ్ పర్యటనని అడ్డుకుంటామని, ఒంటిపై ఇంకు చల్లి తగిన శాస్తి చేస్తామని బెదిరిస్తున్నారు. మా కార్యకర్తలు దారి పొడవునా ఉంటారు. కాదని వస్తే షారుఖ్ కు భంగపాటు తప్పదని అంటున్నారు. గత 17ఏళ్లుగా షారుఖ్ పై కళింగ సేన నాయకులు ఆగ్రహావేశాలతో ఉన్నారు.

ఏం జరిగిందంటే
2001లో షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అశోక చిత్రంలో నటించారు. అశోకుని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కళింగ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారని అప్పట్లోనే పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. కేవలం వారానికి మించి ఈ చిత్రాన్ని ఒడిశాలో ఆడనీయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంతోష్ శివన్ తెరకెక్కించారు. ఒడిశా సంస్కృతిని, రాష్ట్ర ప్రజలని కించపరిచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ ఆరోపణలు ఎదురయ్యాయి.

క్షమాపణలు చెబుతారా
కళింగ సేన బెదిరింపులకు దిగిన నేపథ్యంలో షారుఖ్ క్షమాపణలు చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా షారుఖ్ ప్రస్తుతం జీరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్న కథాంశంతో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











