షూటింగ్ ఆలస్యం: హీరోగారు ఇంటికెళ్లి రావడానికి హెలికాప్టర్!
Recommended Video

ఓ వైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. మరో వైపు అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కావడం లేదు. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోంది. ఇంకా బోలెడంత షూటింగ్, సీజీ వర్క్ పెండింగులో ఉంది. షూటింగ్ పూర్తయితే తప్ప ఆ పని మొదలు పెట్టడానికి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని నిర్మాతలు ఖర్చు ఎక్కువైనా సరే హీరోగారు షూటింగుకు రావడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ఆ హీరో మరెవరో కాదు.... బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

జీరో సినిమా కోసమే ఇదంతా
ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘జీరో' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ముంబై సమీపంలోని వాసైలో షూటింగ్ జరుపుకుంటోంది. షారుక్ నివాసం ఉండే బాంద్రా నుండి అక్కడికి రోజూ కార్లో వెళ్లీ వచ్చేందుకు ఆరు గంటల సమయం కేటాయించాల్సి వస్తోందట. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా షారుక్ సెట్స్‌కు ఆలస్యంగా వస్తుండటం, దీంతో షూటింగ్ ఆలస్యం కావడం లాంటివి జరుగుతున్నాయట.

ప్రత్యేకంగా హెలికాప్టర్
వాసైలో ఏప్రిల్ 8 వరకు ‘జీరో' మూవీ షూటింగ్ షెడ్యూల్ ఉంది. ఇక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులు షారుక్ నివాసం ఉండే బాంద్రా నుండి వాసై వరకు ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

జీరో మూవీ
‘జీరో' చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ పతాకంపై గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షారుక్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రముఖులంతా ప్రత్యేక పాత్రల్లో
‘జీరో' మూవీలో సల్మాన్ ఖాన్, దీపిక పదుకోన్, రాణి ముఖర్జీ, కాజోల్, అలియా భట్, కరిష్మా కపూర్, జుహి చావ్లా తదితరులు స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. వీరంతా సినిమాలో ఓ పాటలో కనిపిస్తారని టాక్.

రిలీజ్ ఎప్పుడంటే..
డిసెంబర్ 21న ‘జీరో' సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఇంకా చాలా షూటింగ్, సీజీ వర్క్ పెండింగులో ఉంది. షారుక్ షూటింగుకు లేటుగా రావడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతోంది. అందుకే ఆయన కోసం స్పెషల్ చాపర్ ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











