2.0 ఫస్ట్ వీక్ కంప్లీట్, ముంచుకొస్తున్న ముప్పు...హిందీ, తెలుగులో లాభాలు సాధ్యమేనా?
Recommended Video

రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో మెగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన 2.0 చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. సౌత్‌తో పాటు హిందీ మార్కెట్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక పోతోందనే వాస్తవం.
హిందీ మార్కెట్లో కలెక్షన్ల పరిస్థితి గమనిస్తే.... మొదటి వారం రూ. 132 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ అదరగొట్టిన ఈ చిత్రం వీక్ డేస్‌లోనూ డబుల్ డిజిట్ సాధించినప్పటికీ సినిమా బడ్జెట్ రేంజికి, థియేట్రికల్ రైట్స్ అమ్ముడైన స్థాయికి తగిన కలెక్షన్లు కావనే వాదన వినిపిస్తోంది.

2.0 ఫస్ట్ వీక్ హిందీ వెర్షన్ కలెక్షన్లు
హిందీ మార్కెట్లో ఈ చిత్రం 7 డేస్ వసూళ్లు పరిశీలిస్తే.... గురువారం రూ. 20.25 కోట్లు, శుక్రవారం రూ. 18 కోట్లు, శనివారం రూ. 25 కోట్లు, ఆదివారం రూ. 34 కోట్లు, సోమవారం రూ. 13.75 కోట్లు, మంగళవారం రూ. 11. 50 కోట్లు రాబట్టింది. 7వ రోజైన బుధవారం రూ. 10.50 కోట్లు వసూలూ చేసింది.

లాభాలు సాధ్యమేనా?
2.0 మూవీ హిందీ రైట్స్ రూ. 80 నుంచి 100 కోట్ల మధ్య అమ్మినట్లు సమాచారం. తొలివారం రూ. 130 కోట్ల గ్రాస్ వసూలైంది. మంచి లాభాలు రావాలంటే కనీసం రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ వసూలు కావాల్సి ఉంది. కలెక్షన్ల తీరు చూస్తుంటే అది సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముంచుకొస్తున్న ముప్పు
మరో వైపు డిసెంబర్ 7న బాలీవుడ్లో ‘కేదార్‌నాథ్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య తగ్గడం కాయం. దానికితోడు ‘కేదార్‌నాథ్' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే 2.0 చిత్రానికి ఎఫెక్ట్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

భారీ అంచనాలతో వస్తున్న ‘కేదార్‌నాథ్’
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతూ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కేదార్‌నాథ్. ఇది పెద్ద హీరో సినిమా కాకపోయినా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కేథార్‌నాథ్ ఆలయం బ్యాక్‌డ్రాపుతో రూపొందే ప్రేమకథా చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగులో పరిస్థితి ఏమిటి?
తెలుగులో 2.0 చిత్రం రైట్స్ రూ. 72 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలి వారం రోజుల్లో రూ. 40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. లాభాల బాటలోకి వెళ్లాలంటే మరో రూ. 32 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











