34 Years Of Gharana Mogudu: 34 ఏళ్ల ఘరానా మొగుడు.. ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్‌తో చిరంజీవి చరిత్ర!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం అప్పటి అంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దేవీ వర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. నగ్మా, వాణి విశ్వనాథ్, రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, శరద్ సక్సేనా, ఆహుతి ప్రసాద్, డిస్కో శాంతి నటించిన సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అయింది.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆల్ టైమ్ రికార్డుగా మారాయి. ఈ చిత్రానికి ఏ విన్సెంట్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. 1992 ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా అట్టహాసంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ 34 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో చిరంజీవి సాధించిన రికార్డులు, రివార్డుల విషయానికి వెళితే..

ఎంఎం కీరవాణి, భువన చంద్ర కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. బంగారు కోడిపెట్ట, కిటుకులు తెలిసినా, హే పిల్లా.. హల్లో పిల్లా, కప్పుకో దుప్పటి, ఎందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు, పండు పండు పండు లాంటి పాటలు ఆబాలగోపాలాన్ని ఆలరించాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు హిట్‌గా నిలిచాయి.. ఈ తరం వారు కూడా రీమిక్స్ చేస్తున్నారు.
తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఘరానా మొగుడు 39 సెంటర్లలో 100 రోజులు, 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో నిర్విరామంగా 183 రోజులు ఆడింది. మలయాళంలో హే హీరో పేరుతో రిలీజ్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. త్రివేండ్రమ్‌లోని ఓ థియేటర్‌లో 175 రోజులు ఆడింది. కేరళలో 1 కోటి రూపాయల షేర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు అందించింది.
ఘరానా మొగుడు తొలి రోజును నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో తొలివారమే 1.35 కోట్ల రూపాయల షేర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 10 కోట్ల షేర్ అంటే సుమారుగా 20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను అప్పట్లో రాబట్టింది. ఆప్పట్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దేవీ వరప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 20 కోట్ల (మలయాళంతో కలిపి) మేర వసూళ్లను సాధించింది . దక్షిణాది సినిమా పరిశ్రమలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఘరానా మొగుడు సినిమా ద్వారా చిరంజీవి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొన్న తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకు ఆయనకు 1.25 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను 1993 సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ సెక్షన్‌లో ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











