తెలుగు సినీ ప్రేమికులకు పండగే.. ఈ వారం ఏకంగా ఎనిమిది సినిమాలు.. ఏమేమంటే?
తెలుగు సినిమా ఎక్కడా తగ్గడం లేదు. మిగతా బాషలతో పోలిస్తే ఎక్కడలేని విధంగా ఒక్క తెలుగులోనే వారానికి అయిదు కంటే ఎక్కువగా సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళం, హిందీలో, మలయాళం, కన్నడ భాషల్లో అతి కష్టం మీద ఒకటి రెండు రిలీజ్ చేయగలుగుతున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఎక్కడా లేని విధంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

మంచి ఊపు మీద
తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి ఊపు మీదుంది. ఇక్కడ కనిపిస్తున్న దూకుడు మరే బాషాలోనూ కనిపించడం లేదు. అలా అని మన థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు ఉండి మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి అనుకుంటే పొరపాటే ఎందుకంటే వారానికి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఆడుతున్న సినిమాలు ఒకటీ అరా మాత్రమే ఉంటున్నాయి.

ఏకంగా ఎనిమిది
మంచి పేరున్న హీరోల సినిమాలకు సైతం ఎక్కువ సెంటర్స్ లో మొదటి రోజే డెఫిసిట్ పడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే శుక్రవారం నవంబర్ 19న థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాల విషయానికి వస్తే ఊరికి ఉత్తరాన, మిస్టర్ లోన్లీ, పోస్టర్, రామ్ అసుర్, రావణలంక, సావిత్రి వైఫ్ అఫ్ సత్యమూర్తి, స్ట్రీట్ లైట్ చిత్రాలతో పాటు నేరగాడు అనే డబ్బింగ్ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు..

ప్రమోషన్స్ లేవు
ఇన్ని సినిమాలు వస్తున్నా ఒక్క సినిమా కూడా పేరున్న హీరోలవి కావు. అంతేకాక ఈ సినిమాలలో ఒక్క డానికి కూడా పెద్ద బజ్ లేదు. ఉన్నంతలో రెండు మూడు సినిమా యూనిట్లు ప్రమోషన్లు చేస్తూ మీడియాలో, సోషల్ మీడియాలో హై లైట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ ఇవి ఎంత వరకు ఉపయోగపడతాయి అనే సంగతి చెప్పలేం.

అన్ని వచ్చినా
అయితే కనీసం విడుదలైన విషయం జనానికి తెలియాలంటే ఆ మాత్రం అయినా చేయాలి తప్పదు మరి. అయితే అన్నీ చిన్న సినిమాలు కాబట్టి తక్కువ థియేటర్లు ఉండే చాలా సెంటర్స్ లో కొన్ని రిలీజయ్యే ఛాన్స్ కూడా లేదని చెప్పాలి. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేని సినిమాలు ఇలా వదిలేస్తే ఎలా? మరోపక్క హిందీలో యాష్ రాజ్ సంస్థ నిర్మించిన బంటీ ఆర్ బబ్లీ 2 కూడా అదే రోజు రానుంది.

హిందీ నుంచి కూడా
అది కాక శుబ్ రాత్రి, ఏ మర్డ్ బేచారా కూడా వస్తున్నాయి. వీటి గురించి ఎలాంటి ప్రచారమూ లేదు. అదే రోజున హాలీవుడ్ మూవీ చార్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ సైతం రేస్ లో దిగింది. ఇలా లెక్క ప్రకారం చూస్తే పదికి పైగా సినిమాలు వస్తున్నా, ఈ సినిమాల వలన బాక్సాఫీస్ కు పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకోవడం దండగ ప్రయాసే అవుతుంది. ఒకటో రెండో చాలా బాగున్నాయని టాక్ వస్తే తప్ప బాక్సాఫీస్ గట్టు ఎక్కడం గగనమే. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











