Valimai Day 2 Collections.. మాస్టర్, అన్నాతే రికార్డులు బ్రేక్.. అజిత్ మూవీ 100 కోట్లవైపు పరుగు..
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, యువ హీరో కార్తీకేయ కాంబినేషన్‌లో హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బోని కపూర్ నిర్మించిన వలిమై చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల విషయంలోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా 4500 స్రీన్లలో
కోవిడ్ పరిస్థితుల తర్వాత విడుదలైన వలిమై భారీ బడ్జెట్ చిత్రం కావడంతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు అజిత్ కెరీర్‌లోనే అతి పెద్ద రిలీజ్‌గా వలిమై చరిత్ర సృష్టించింది. కేవలం తమిళనాడులోనే 900 పైగా స్క్రీన్లలో ప్రదర్శించబడుతున్నది.

అన్నాతే, మాస్టర్ చిత్రాల రికార్డులను..
భారీ అంచనాలతో రిలీజైన వలిమై చిత్రం తమిళనాడులో తొలి రోజు కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం విజయ్ నటించిన మాస్టర్, రజనీకాంత్ నటించిన అన్నాతే తొలి రోజు కలెక్షన్లను అధిగమించింది. తొలి రోజున మాస్టర్ చిత్రం తమిళనాడులో 25.26 కోట్లు వసూలు చేయగా, రజనీకాంత్ నటించిన అన్నాతే చిత్రం 24.31 కోట్లు రాబట్టింది. అయితే ఈ రెండు సినిమా కలెక్షన్లపై ఆధిపత్యం సాధిస్తూ వలిమై 36 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ దెబ్బ
ఇక వలిమై సినిమాపై నెగిటివ్ రావడంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్, హిందీలో గంగూభాయ్ కతియావాడి సినిమాలు రిలీజ్ కావడంతో భారీ దెబ్బ పడింది. అయితే ఈ సినిమా తెలుగులో దారుణమైన కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజు పలు ప్రాంతాల్లో సినిమాను థియేట్లర నుంచి తీసేయడం గమనార్హం.

తమిళనాడులో రెండో రోజు
డివైడ్ టాక్ మధ్య కూడా వలిమై చిత్రం తమిళనాడులో రెండో రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 36 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే రేంజ్‌లో వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో రెండో రోజులు కలెక్షన్లు 45 నుంచి 50 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు
అలాగే వలిమై రెండు రోజుల వసూళ్ల విషయానికి వస్తే.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 96 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు మరో 70 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. వలిమై 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా వేగంగా 100 కోట్ల మార్కును చేరుకొన్న చిత్రంగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











