Thandel Box Office : తండేల్ వసూళ్ల జాతర.. వీకెండ్‌లో కుమ్మేసిన నాగచైతన్య, ఎన్ని కోట్లంటే?
అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార కుటుంబాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చందూ మొండేటీ తెరకెక్కించారు. చైతూ, సాయి పల్లవిల నటనకు .. దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ తోడు కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతోన్న నాగచైతన్యకి తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది తండేల్. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద 9వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
తండేల్‌లో నాగచైతన్య సరసన లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో తండేల్‌కు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. తండేల్‌ను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సుమారుగా రూ. 75 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు.

టీజర్, ట్రైలర్లు, నాగచైతన్య లుక్‌తో తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్లు .. హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్, 54 కోట్లుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

8 రోజుల వరకు తండేల్ చిత్రం నైజాంలో 15.85 కోట్లు, సీడెడ్‌లో రూ.4.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.2.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, గుంటూరులో రూ.2.02 కోట్లు, కృష్ణాలో రూ.1.89 కోట్లు, నెల్లూరులో రూ. 1.15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో రూ.56.85 కోట్ల గ్రాస్.. రూ. 35.32 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.3.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ. 75.70 కోట్ల గ్రాస్.. రూ.43.37 కోట్ల షేర్ రాబట్టింది.
బ్రేక్ ఈవెన్‌ను ఊదేసిన తండేల్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు తండేల్ వసూళ్ల విషయానికి వస్తే వీకెండ్ కావడంతో శనివారం సాలీడ్ బుకింగ్స్ అయ్యాయి. తెలుగులో రూ. 2.58 కోట్లు, హిందీలో రూ.10 లక్షలు, తమిళ్‌లలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షల చొప్పున మొత్తంగా 3.23 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆదివారం కూడా తండేల్ కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











