ముంబైలోని ప్రాపర్టీస్ అమ్మిన అక్షయ్ కుమార్.. లాభం ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితుడే. ఆయన చిత్రాలు తెలుగు వెర్షన్ లోనూ డబ్డ్ అవుతుండటంతో ఇక్కడి ఆడియెన్స్ ను కూడా బాగా ఆకట్టుకున్నారు. మరోవైపు తన ప్రత్యేక నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం. తన అభిమానులకు అక్షయ్ కుమార్ ఎంతో జవాబుదారీగా ఉంటారు. 1987 నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇక త్వరలో అక్షయ్ కుమార్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ లో శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.0 చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించారు. విలన్ పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి సౌత్ ఆడియెన్స్ కు కూడా అక్షయ్ కుమార్ సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చివరిగా 'రామ్ సేతు', 'మిషన్ రాణిగంజ్', 'సింగమ్ ఎగైన్' వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం 'కేసరి ఛాప్టర్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. అక్షయ్ కుమార్ రీసెంట్ గా రూ.3 కోట్ల వరకు లాభం పొందడం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ స్టార్స్ తరుచుగా కొత్త ఫ్లాట్లను కొనుగులు చేస్తూ అమ్ముతూ ఉంటారు. ప్రాపర్టీలను అమ్మడం కొనడం వారికి సర్వసాధారణం. అయితే తాము కొనుగోలు చేసే ప్రాపర్టీస్ వల్ల కోట్లట్లో లాభాలను గడిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ప్రాఫిట్ పొందారు. ఏకంగా తను పెట్టుబడి పెట్టిన దానికంటే డబుల్ ప్రాఫిట్ ను అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తను గతంలో ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో కొనుగోలు చేసిన రెండు అపార్టుమెంట్లను రీసెంట్ గా అమ్మేశారు. దీంతో భారీ లాభాన్ని పొందారని బాలీవుడ్ మీడియా తెలియజేస్తుంది.
అయితే, అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివాలి తూర్పు ప్రాంతంలో రెండు అపార్ట్‌మెంట్‌లను గతంలో కొనుగోలు చేశారు. వాటిని వారం రోజుల కింద రూ.6.60 కోట్లకు విక్రయించారు. వాటి ద్వారా 89 శాతం రాబడిని పొందారంట. కాగా, 2017లో రూ.3.49 కోట్లకు 1,080 చదరపు అడుగులు ఒక ప్లాట్, అలాగే 252 చదరపు అడుగుల యూనిట్లకు చెందిన మరో ప్లాట్ ను కొనుగోలు చేశారు. ఇక మార్చి 20న రూ.5.35 కోట్లు, రూ.1.25 కోట్లకు విక్రయించారు. ఇలా దాదాపుగా అక్షయ్ కుమార్ కేవలం ఎనిమిదేళ్లలోనే రూ.3 కోట్ల వరకు లాభం పొందారు. ఇలా కూడా స్టార్స్ తమ సొమ్మును డబుల్ చేసుకుంటూ ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఇక అక్షయ్ కుమార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరమశివుడి పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అక్షయ్ కుమార్ 57 ఏళ్ల వయస్సు లోనూ ఫిట్ గా కనిపిస్తూ షాకిస్తున్నారు. ఈ వయస్సు లోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అరడజన్ కు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











