Pushpa Day 2 collections.. వంద కోట్లపై కన్నేసిన పుష్ప.. నైజాంలో వసూళ్ల నవాబ్‌గా అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద వార్ వన్ సైడ్‌గా కనిపిస్తున్నది. ఆంధ్రాలో మినహాయించి విడుదలైన ప్రతీ చోట వసూళ్ల మోతను మోగిస్తున్నది. అయితే తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సృష్టించిన ఈ చిత్రం మూడో రోజున భారీ వసూళ్లను సాధించే అవకాశం కనిపిస్తున్నది. టాలీవుడ్‌లో ఓ మైలురాయిపై కన్నేసిన పుష్ప రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎంత ఉందంటే..

2021లో రిలీజైన చిత్రాల్లో రికార్డు
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా మెరుగైన కలెక్షన్లను సాధించింది. కోవిడ్ తర్వాత రిలీజైన చిత్రాల్లో అంటే 2021లో రికార్డు కలెక్షన్లను సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతతో వసూళ్ల జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది.

అమెరికాలో ప్రభంజనం కొనసాగిస్తూ..
అమెరికాలో పుష్ప ప్రభంజనంగా గట్టిగానే కొనసాగుతున్నది. ప్రీమియర్ల ద్వారా 543,603 డాలర్లను, అలాగే తొలి రోజు 426,944 అమెరికన్ డాలర్లను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ చిత్రం 7.80 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వసూలు చేసింది. ఇక రెండో రోజున ఈ చిత్రం 3 లక్షల డాలర్లకుపైగా రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నైజాంలో వసూళ్ల హవా
పుష్ప కలెక్షన్ల ప్రభంజనం నైజాంలో కొనసాగుతున్నది. ఈ చిత్రం తొలి రోజు 11.44 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండో రోజు ఈ చిత్రం మరో 8 కోట్లకుపైగా రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే సీడెడ్‌లో రెండో రోజు మరో 3 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.

ఆంధ్రాలో బలహీనంగా కలెక్షన్లు
ఇక ఆంధ్రాలోని ప్రధాన జిల్లాలకు వస్తే.. రెండో రోజున ఉత్తరాంధ్రలో మరో కోటికిపైగా రూపాయలను, తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కోటి రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణ జిల్లాలో 1 కోటి, నెల్లూరులో 1 కోటి రూపాయలను సుమారుగా రాబట్టే అవకాశం ఉంది. దాంతో రెండో రోజున ఈ చిత్రం మరో 20 కోట్లు నికరంగా, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

పుష్ప లాభాల్లోకి రావాలంటే..
పుష్ప సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 145 కోట్ల ప్రీ రిలిజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 146 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం 39 కోట్ల షేర్‌ను సాధించింది. ఇంకా 107 కోట్లు రాబట్టగలిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ జోన్‌లోకి ప్రవేశిస్తుంది.


Click it and Unblock the Notifications











