Pushpa 2 : బాహుబలి 2 రికార్డు బ్రేక్ .. 1831 కోట్లతో అల్లు అర్జున్ సంచలనం
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హైయస్ట్ గ్రాసర్ సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలు మాత్రమే కనిపించేవి. వీటి ముందు ప్రాంతీయ చిత్రాల మార్కెట్ అంతంత మాత్రమే. నిజానికి హిందీ కూడా రీజనల్ మార్కెట్టే. కాకపోతే దేశంలో హిందీ మాట్లాడే ప్రజలు, ప్రాంతాలు ఎక్కువ. ఈ పాపులేషన్ , పాపులారిటీ మూలాన హిందీ చిత్రాలకు కలెక్షన్లు వచ్చి పడేవి. అలా వారు అప్పట్లోనే రూ. 300 కోట్లు- రూ. 400 కోట్లను అలవోకగా క్రాస్ చేసేవారు .
ఆ టైంకి మన తెలుగు సినిమాలు 100 కోట్లు మార్క్ దాటితే అదే పెద్ద సెన్సేషన్. ఈ ఫీట్ కొట్టడానికి టాలీవుడ్‌కి చాలా కాలమే పట్టింది. తర్వాత నెమ్మదిగా 200 కోట్ల క్లబ్‌లో తెలుగు సినిమాలు చేరాయి. ఇలాంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రాంతీయ- జాతీయ అన్న బ్యారియర్స్‌ను బద్ధలు కొడుతూ జక్కన్న తీసుకొచ్చిన పాన్ ఇండియా చిత్రం "బాహుబలి" దెబ్బకి అన్ని లెక్కలు, బాక్సాఫీస్ షేప్‌లు మారిపోయాయి.

ఈ సినిమా తర్వాతి నుంచి పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అనేక దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెంది బాలీవుడ్‌ను షేక్ చేశాయి. ఇక బాహుబలి 1 ఒక దెబ్బ అయితే బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవడంతో పాటు అనేక కొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేసింది బాహుబలి 2. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అయితే చైనా రిలీజ్ కాకుండా చూస్తే 2017 నుంచి ఇప్పటి వరకు బాహుబలి 2 మాత్రమే 1800 కోట్లకి పైగా గ్రాస్ చేసింది. ఈ రికార్డుల్ని చాలా సినిమాలు బద్దలు కొడతాయి అనుకున్నారు. ఆ మధ్య వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ అలాంటి ఎన్నో సినిమాలు క్రాస్ చేయలేని పొజిషన్‌లో ఉన్న బాహుబలి 2ని మరో తెలుగు చిత్రం వణికించింది. అదే పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఒక్కొక్క సినిమాను తొక్కుకుంటూ ఇప్పుడు బాహుబలి 2ని కొట్టిపడేసింది.

బాహుబలి 2 టోటల్ రన్‌లో రూ. 1810 కోట్ల వసూళ్లు సాధించగా పుష్ప 2 కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లోనూ, తెలుగు సినిమాలు, దక్షిణాది సినిమాల లిస్ట్‌లో నెంబర్ వన్‌గానూ నిలిచింది. హిందీ బెల్ట్‌లో వసూళ్ల పంట పండటంతోనే పుష్ప 2కి ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దంగల్‌ను బీట్ చేసి ప్రథమ స్థానంలోకి రావాలంటే పుష్ప 2 కనీసం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాల్సి ఉంది. సంక్రాంతికి కొత్త సినిమాల తాకిడి మొదలు కానుండటంతో పుష్ప 2 ఏ మేరకు తట్టుకుని నిలబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











