Vimanam collections సముద్రఖని మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే? అనసూయ బాక్సాఫీస్ విమానం ఎక్కించిందా?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్డూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిమ్మకాయల ప్రసాద్, కిరణ్ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమానం. ఈ చిత్రం ద్వారా శివ ప్రసాద్ యానాల దర్శకుడిగా పరిచయం అయ్యారు.
విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని, మాస్టర్ ధృవన్, అనసూయ భరద్వాజ్, ధన్ రాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రత్యేక పాత్రలో మీరా జాస్మిన్ నటించిన ఈ చిత్రం జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తున్నదనే విషయంలోకి వెళితే..

విమానం సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం, బంధాల నేపథ్యంతో రూపొందింది. తల్లి లేని కుమారుడు విమానం ఎక్కాలనే కోరికను పేద తండ్రి తీర్చడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు. ఆ కష్టాల సమయంలో వారిద్దరి మధ్యకు వచ్చిన మరో సమస్య ఏమిటి? అనేది ఈ సినిమా కథ. సముద్రఖని, ధృవన్, అనసూయ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా మారాయనేది క్రిటిక్ అభిప్రాయం.
తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్‌తో విమానం సినిమాను జీ స్టూడియోస్ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని సుమారు 8 కోట్ల వ్యయంతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రొడక్షన్ కాస్ట్‌తోపాటు నటీనటుల పారితోషికాలు ఈ సినిమా బడ్జెట్ పెంచేలా చేసిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేశారు.
విమానం సినిమాకు సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్ ఆడియెన్స్‌ను రప్పించేలా ప్రయత్నించారు. ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో తెలుగు, తమిళంలో కలిపి సుమారు 700 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాను 200 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో సుమారుగా ఈ సినిమా 900 స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండో రోజు నుంచి తెలుగులో స్క్రీన్ల కౌంట్ పెంచినట్టు నిర్మాతలు తెలిపారు.

విమానం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు, తమిళంలో తొలి రోజు మోస్తారు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మౌత్ టాక్‌తో ఈ సినిమా రెండో రోజు నుంచి ఆక్యుపెన్సీ పుంజుకొన్నది. తెలుగు, తమిళంలో కలిపి ఈ సినిమా తొలి రోజు 70 లక్షల గ్రాస్, 35 లక్షల షేర్, రెండో రోజు 80 లక్షలకుపైగా గ్రాస్, 40 లక్షల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
విమానం సినిమా థియేట్రికల్ వ్యాల్యూను 3 కోట్లుగా అంచనా వేశారు. తొలివారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించినట్టయితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











