తిరుగులేని ఎన్టీఆర్.. రెండోస్థానంలో అరవింద సమేత.. రికార్డు కలెక్షన్లు వచ్చినా..!
అరవింద సమేత వీర రాఘవ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద మూడోవారం కూడా మెరుగైన కలెక్షన్లను రాబట్టింది. దారుణమైన ఫ్లాప్‌ను వీర భోగ వసంత రాయలు మూటగట్టుకోవడం అరవిందకు కలిసి వచ్చింది. అయితే ఈ చిత్రానికంటే హలో గురూ ప్రేమ కోసమే చిత్రం వసూళ్లు బెటర్‌గా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అరవింద సమేత వసూళ్ల వివరాల్లోకి వెళితే..

యూఎస్ బాక్సాఫీస్ వద్ద
త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత తొలివారం యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. అరవింద విడుదల తర్వాత రిలీజైన మూడు చిత్రాలను ధీటుగా ఎదుర్కొన్నది. హలో గురు ప్రేమ కోసమే నుంచి ఎదురైన గట్టి పోటిని తట్టుకొని నిలబడింది. మూడోవారంలో మంచి కలెక్షన్లు రాబట్టి అరవింద రెండో స్థానంలో నిలిచింది.

మూడో వారాంతంలో వసూళ్లు
అమెరికాలో అరవింద సమేత మూడో వారాంతానికి 28,653 డాలర్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా 18 రోజలు కలెక్షన్లను పరిశీలిస్తే 2,170,353 డాలర్లు రాబట్టింది. మూడోవారంలో శుక్రవారం 7,911 డాలర్లు, శనివారం 14,165 డాలర్లు, ఆదివారం 6,577 డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండోస్థానంలో అరవింద సమేత
అమెరికాలో గతవారం తెలుగు సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే .. హలో గురూ ప్రేమ కోసమే రూ.43 లక్షలు, అరవింద సమేత రూ.33 లక్షలు, వీర భోగ వసంత రాయలు రూ.27 లక్షలు వసూలు చేశాయి. గతవారం ముగింపులో సుమారు రూ.1 కోటి వసూళ్లు రాబట్టడం గమనార్హం.

పెట్టుబడికి మించిన వసూళ్లు
అరవింద సమేత అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను రూ.14.40 కోట్లకు అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తే దాదాపు 100 శాతం పెట్టుబడిని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రికార్డుస్థాయి కలెక్షన్లు రాబట్టినా లాభాల్లోకి రాకపోవడం డిస్టిబ్యూటర్లకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.


Click it and Unblock the Notifications











