Athadu 4K Re-Release Box Office: అతడు సెకండ్ రీ రిలీజ్ కలెక్షన్స్.. మహేశ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించి అతడు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది ఈ సినిమా. యాక్షన్, రివెంజ్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో సెల్యూలాయిడ్‌పై త్రివిక్రమ్ ఆవిష్కరించిన ఈ మూవీని థియేటర్‌లో, బుల్లితెరపై కొన్ని వందలసార్లు చూశారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గానే అనిపిస్తుంది అతడు.
రీ రిలీజ్‌లో అతడు ప్రభంజనం
రీ రిలీజ్‌ల శకంలోనూ అతడు ప్రభంజనం సృష్టించింది. మహేశ్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని 2025 ఆగస్ట్ 9న అతడుని 4కే వెర్షన్‌లో అత్యాధునిక సౌండ్ సిస్టమ్, వీఎఫ్ఎక్స్ హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్స్‌తో అతడు సంచలనం సృష్టించింది. ఏకంగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఫిబ్రవరి 28వ తేదీన అతడుని 4కే వెర్షన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో అతడు సెకండ్ రీ రిలీజ్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

అతడు తారాగణం
జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై కిశోర్ దుగ్గిరాల, ఎం రామ్మోహన్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా.. మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్, షయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 2005 ఆగస్ట్ 10న అతడు తొలిసారిగా థియేటర్‌లో రిలీజ్ అయ్యింది.
అతడు సెకండ్ రీ రిలీజ్ బిజినెస్
సెకండ్ రీ రిలీజ్‌లో అతడు థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. నైజాం థియేట్రికల్ రైట్స్ 18 లక్షల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 16 లక్షల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా 3 లక్షల రూపాయలు చొప్పున ఓవరాల్‌గా 40 లక్షల రూపాయల మేర బిజినెస్ చేసింది. సెకండ్ రీ రిలీజ్‌లో అతడు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 41 లక్షల రూపాయల షేర్.. 85 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు నిర్దేశించాయి.
అతడు సెకండ్ రీ రిలీజ్ కలెక్షన్స్
అతడు సెకండ్ రీ రిలీజ్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే మహేశ్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. మహేశ్ పుట్టినరోజు లేదంటే మరేదైనా సందర్భం లేకుండానే అతడు రిలీజ్ అయినా మంచి ఆక్యూపెన్సీ నమోదు కావడం విశేషం. ఫిబ్రవరి 28 నాడు అతడు రీ రిలీజ్ కాగా.. థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం .. శనివారం అతడు మూవీకి నైజాంలో 40 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 15 లక్షల రూపాయలు, కర్ణాటకలో 3 లక్షల రూపాయలు చొప్పున 58 లక్షల రూపాయల గ్రాస్ వసూలైంది.
100 రూపాయలకే టికెట్
సెకండ్ రీ రిలీజ్ సందర్భంగా అతడు నైజాం హక్కులు 18 లక్షల రూపాయల మేర అమ్ముడైంది. ఈ టార్గెట్‌ను కొట్టేసి నైజాంలో అప్పుడే ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది అతడు. అయితే ఆంధ్రాలో మాత్రం బ్రేక్ఈవెన్‌కి అడుగుదూరంలో నిలిచినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అతడు సెకండ్ రీ రిలీజ్‌లో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 63 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధరను 100 రూపాయలకే అందుబాటులో ఉంచుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరి సెకండ్ రీ రిలీజ్‌లో అతడు ఓవరాల్‌గా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











