Avatar 3 Box Office: 9000 కోట్ల వసూళ్లకు చేరువగా అవతార్ 3 మూవీ.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మించారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటించారు. అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
అవతార్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా కోసం కొత్త తెగను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఈ మూవీ కోసం ఊహకు అందని విధంగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సి రావడంతో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌ను చేశారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఇండియాలో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లను సాధించింది? వరల్డ్ వైడ్‌గా ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

అవతార్ 3 చిత్రం ఇండియాలో తొలివారం సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ మొదటి 7 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ 47.55 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 34.9 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 11 కోట్లకుపైగా, తమిళ వెర్షన్ 15 కోట్లకుపైగా, కన్నడ వెర్షన్ 18 కోట్ల రూపాయలు, మలయాళం వెర్షన్ 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి వారం 128 కోట్ల రూపాయలు రాబట్టింది అని సాక్ నిక్ వెల్లడించింది.
అవతార్ 3 సినిమా రెండోవారంలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా కేవలం 50 కోట్ల రూపాయల వసూళ్లకే పరిమితమైంది. ఇంగ్లీష్ వెర్షన్ 22 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 18.5 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 2 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 8 కోట్లకుపైగా వసూలు చేసింది. కన్నడ, మలయాళ బాక్సాఫీస్ వివరాలు తెలియాల్సి ఉంది. రెండోవారంలో సుమారుగా 50 నుంచి 60 కోట్ల మధ్య వసూళ్లను సాధించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
అవతార్ చిత్రం గత 17 రోజుల్లో ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ 70 కోట్లకుపైగా, హిందీ వెర్షన్ 55 కోట్లకుపైగా, తెలుగు 13 కోట్లకుపైగా, తమిళ వెర్షన్ 24 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. కన్నడ, మలయాళ వెర్షన్ వివరాలు సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమా ఇండియాలో అన్ని భాషల్లో కలిపి సుమారుగా 190 నుంచి 200 కోట్ల నెట్ రూపాయల వరకు వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.
ఇక అవతార్ 3 చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 200 కోట్ల రూపాయల నెట్, 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ ఈ చిత్రం 6000 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 2200 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8400 కోట్ల నుంచి 8600 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే 9000 కోట్ల రూపాయల క్లబ్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











