Avatar: The Way of Water Re Release: 17000 కోట్ల అవతార్ 2 మళ్లీ.. కామెరాన్ మూవీ రీరిలీజ్ ట్విస్ట్ ఏమిటంటే?
ప్రపంచ సినీ దిగ్గజం జేమ్స్ కామెరాన్ దర్శకత్వంతోపాటు రచన, స్క్రీన్ ప్లే, కథ, నిర్మాణ సారథ్య బాధ్యతలు వహించి రూపొందించిన చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar 2). లైఫ్‌స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రంలో సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, సీగుర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జో డేవిడ్ మూర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జాన్ లాడావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని రస్సెల్ కార్పంటర్, ఎడిటింగ్ బాధ్యతలను స్టెఫాన్ ఈ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నెర్, జాన్ రెఫీవా, మ్యూజిక్‌ను సైమాన్ ఫ్రాగ్లెన్ అందించారు. ఈ సినిమా డిసెంబర్ 16వ తేదీ 2022 తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఆ సమయంలో వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం మరోసారి రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అవతార్ 2 కథేమిటంటే?
యూఎస్ ఆర్మీలో పనిచేసే జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) నావీగా మారడం, తిరుగుబాటు చేయడాన్ని సహించలేని అధికారులు.. పండోరా గ్రహంలోని నావీ తెగపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటారు. ఆర్మీ నుంచి తప్పించుకోవడానికి అటవీ ప్రాంతం నుంచి సముద్రంలోకి నావీ తెగ సభ్యులు మకాం మారుస్తారు. సముద్ర జలాల్లో ఉన్న జేక్ సల్లీ, నేత్రీ (జో సల్దానా) ఫ్యామిలీని, నావీ తెగను టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్‌లో భాగంగా జేక్ సల్లీ పిల్లలను కిడ్నాప్ చేస్తారు. పండోరా గ్రహాన్ని ఆక్రమించి నావీ తెగను నాశనం చేయాలనే కుట్రను జేక్ సల్లీ ఎలా అడ్డుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే అవతార్ 2 (Avatar: The Way of Water) సినిమా కథ.

3200 కోట్ల బడ్జెట్‌తో
అయితే ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే.. సుమారుగా 3200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో 48200 స్క్రీన్లలో, ఇండియాలో 3800 స్క్రీన్లలో మొత్తంగా 52 వేల స్క్రీన్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ స్థాయి నుంచే రికార్డు వసూళ్లను నమోదు చేసింది.
ఇండియాలో కలెక్షన్లు ఇలా..
ఓవర్సీస్‌తోపాటు ఇండియాలో అవతార్ 2 చిత్రం కలెక్షన్లు నమోదు తీరుతో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ 210 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 128 కోట్ల రూపాయలు, తెలుగులో 29 కోట్ల రూపాయలు, తమిళంలో 18 కోట్ల రూపాయలు, మలయాళంలో 7 కోట్ల రూపాయలు, కన్నడలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 410 కోట్ల నెట్ కలెక్షన్లు, 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్లు
ఇక అవతార్ 2 చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం సుమారుగా 17400 కోట్ల రూపాయల కలెక్షన్లను వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసింది. అలాంటి బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగించిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నది. అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 2 తేదీన రి రీలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది.
అమెరికాలో కంటే ఒకరోజు ముందుగానే..
ఈ సినిమా 3డీ వెర్షన్‌ను వారంపాటు మాత్రమే ప్రదర్శిస్తారని తెలిపారు. అమెరికాలో కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయడం విశేషంగా మారింది. ఈ సినిమా థియేట్రికల్ అనుభూతిని పొందాలనుకొనే ప్రేక్షకులు సిద్దమవ్వండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











