Baahubali The Epic Closing Collections: బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
తెలుగు సినీ రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమాకు ఎప్పటిలానే భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

బాహుబలి సినిమాను సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీగా నిర్మించారు. ఈ సినిమా మొదటి భాగానికి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఈ సినిమా కేవలం 650 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయినా ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో భాగం అంటే బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ జర్నీ విషయానికి వస్తే.. తొలి వారం ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 20 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. హిందీ వెర్షన్ సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడ వెర్షన్ మాత్రం 4.5 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 3 కోట్ల రూపాయలు, మలయాళం వెర్షన్ 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి వారం ఈ చిత్రం 37 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రెండు వారాల థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 22 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలు, తమిళంలో 3.5 కోట్ల రూపాయలు, కేరళలో 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 40.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు వెర్షన్ $867K, హిందీ వెర్షన్ $64K, తమిళ వెర్షన్ $2K, మలయాళం వెర్షన్ $100K కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ సినిమా 933K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 8.26 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల మేర వసూళ్లను సాధించింది అని పేర్కొంటున్నారు.
బాహుబలి సినిమా విషయానికి వస్తే.. రెండు భాగాలుగా విడుదల చేయడం తెలిసిందే. అయితే ఆ రెండు పార్ట్స్‌ను కలిపి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మూవీగా సుమారుగా 3.45 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలోని ప్రధానమైన సన్నివేశాలను కూర్పు చేసిన విధానం చక్కగా ఉంది అనే టాక్ మూవీ రిలీజ్ తర్వాత స్పష్టమైంది. దాదాపు ఐదున్నర గంటల కథను తగ్గించి సన్నివేశాలను పేర్చిన విధానం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభకు, విజన్‌కు అద్దం పట్టింది. స్టోరీ ఫ్లోను ఏ మాత్రం డిస్ట్రబ్ కాకుండా కథను పరుగులు పెట్టించాడు అని ప్రేక్షకుల కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపించింది.


Click it and Unblock the Notifications











