BMW Business: భర్త మహాశయులకు విజ్ఞప్తికి షాకింగ్ బిజినెస్? రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే?
వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు మాస్ మహారాజా రవితేజ. వాల్తేర్ వీరయ్య తర్వాత ఆయన చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది విడుదలైన మాస్ జాతర సైతం నిరాశపరిచింది. దాంతో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాలి. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన మూవీయే భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాలు పరిశీలిస్తే..
భర్త మహాశయులకు విజ్ఞప్తి తారాగణం
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతిలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంత?
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం రవితేజ కెరీర్‌లో 76వది కావడం విశేషం. మరో నాలుగు సినిమాలు చేస్తే 80 సినిమాల మైలురాయిని ఆయన చేరుకోనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం హీరో రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా హిట్ అయి లాభాలు వచ్చిన తర్వాత అందులో వాటా తీసుకుంటానని నిర్మాతలకు రవితేజ హామీ ఇచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ షూటింగ్ జరుపుకుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రేడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. ఇక ఆడియో, డబ్బింగ్ హక్కులకు కూడా అంతంత మాత్రంగానే బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక... భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేట్రికల్ బిజినెస్ నామమాత్రంగా జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆంధ్రా, నైజాం, సీడెడ్, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ నిర్దేశించారు. సంక్రాంతికి చిన్నా, పెద్దా సినిమాలు కలిపి దాదాపు ఏడెనిమిది చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ పోటీలో భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











