4 రోజల్లో 101 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను వణికిస్తున్న అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన ఫాంటసీ, హారర్ కామెడీ భూత్ బంగ్లా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: దివాకర్ మణి, ఎడిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్, మ్యూజిక్: ప్రీతమ్, రోని రాఫెల్ అందించారు. కామెడీ, హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి? ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భూత్ బంగ్లా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, వమికా గబ్బీ, టబు, పరేశ్ రావెల్, రాజ్ పాల్ యాదవ్ లాంటి స్టార్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భూత్ బంగ్లా సినిమా ప్రమోషన్స్‌కు మంచి క్రేజ్ లభించడంతో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 3200 కుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 180 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే కనీసం 250 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
భూత్ బంగ్లా సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్లతో ప్రారంభించారు. ప్రీమియర్ల ద్వారా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు 12.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 19 కోట్ల రూపాయలు, మూడో రోజు 23 కోట్ల రూపాయలు, 4వ రోజు 6.75 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి సోమవారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉండటంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుందనే ఆశాభావాన్ని ట్రేడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా 64.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రం ఓవర్సీస్‌లోను భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. నార్త్ అమెరికా, గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 3.5 మిలియన్ డాలర్లు అంటే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 78 కోట్ల రూపాయల గ్రాస్, 64.75 కోట్ల నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 33 కోట్ల రూపాయలు కలిపితే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా మొత్తంగా 101 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ పండితులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications