4 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లు.. చరిత్ర సృష్టించిన సన్నీడియోల్ బోర్డర్ 2
హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ బోర్డర్ 2. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో బోర్డర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, వార్ డ్రామాగా రూపొందిన బోర్డర్ సినిమాను దేశ సరిహద్దులని మిలటరీ స్థావరాల్లో భారీగా తెరకెక్కించారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఇక ఈ చిత్రంపై పబ్లిక్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో, వరల్డ్ వైడ్‌గా 7000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
సన్నీడియోల్ కెరీర్‌లోనే ఎన్నడూలేని విధంగా అంచనాలు పెంచిన ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 30 కోట్ల రూపాయలు, రెండో రోజు 36.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 54.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే 121 కోట్ల రూపాయలు రాబట్టి రికార్డు కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమా మూడు రోజుల్లో సుమారుగా 30 కోట్ల రూపాయలను ఓవర్సీస్‌లో రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 150 కోట్ల మార్కును దాటింది. ఇటీవల కాలంలో దురంధర్ సినిమా తర్వాత ఈ రేంజ్ కలెక్ష్లను రాబడుతున్న హిందీ చిత్రంగా రికార్డును నమోదు చేస్తున్నది.
ఇదిలా ఉండగా, సోమవారం కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. రిపబ్లిక్ డే హాలీడే ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. దాంతో ఈ సినిమా 4వ రోజున ఇండియాలో మరో 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 55 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. దాంతో ఈ మూవీ కేవలం 4 రోజుల్లో 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుంది. ఇంకా పాజిటివ్‌గా మారితే ఈ వసూళ్లు 60 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











